సంగీత పాఠాలు చెబుతూ..
అమ్మ ప్రోత్సాహంతో..
చిన్ననాటినుంచే సంగీత సాధన
పాటలు రాస్తూ.. పాడుతూ..
తాను నేర్చుకుని, నలుగురికి నేర్పిస్తోన్న మహతి
కామారెడ్డిలో సంగీత ప్రదర్శన ఇస్తున్న మహతి (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నేర్పించిన పద్యాలు, పాటలతో ఆమె అ డుగులు సంగీతంవైపు పడ్డాయి. తన ఆసక్తిని గ మనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో చదువుకుంటూనే తనలోని ప్రతిభకు పదును పెడుతోంది కామారెడ్డికి చెందిన మహతి. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న పప్పుల మహతి తన గాత్రంతో ప్రశంసలు అందుకుంటోంది.
కామారెడ్డికి చెందిన పప్పుల నవనీత శ్రీకాంత్‌ల కూతురు మహతి మూడో తరగతి నుంచే పా టలపై ఆసక్తి పెంచుకుంది. కూతు రు ఆసక్తిని గమనించి కర్ణాటక సంగీతం కూడా నేర్పించారు. కర్ణాటక సంగీతంలో మంచి పట్టు సాధించడంతో ఇప్పుడు హిందుస్థానీ సంగీతంపైనా దృష్టి సారించింది. అలాగే వీణ వాయించడమూ నేర్చుకుంటోంది. భగవద్గీతలోని శ్లోకా లనన్నింటినీ కంఠస్థం చేసిన మహతి.. అవన్నీ అలవోకగా పఠిస్తోంది. నవరాత్రి, దీపావళి, ఉగాది, శ్రీరామనవవి వంటి పండుగలపై పలు పాటలు రాసింది. కామారెడ్డిలో జరిగిన పలు కార్యక్రమాల వేదికలపై పాటలుపాడి ప్రశంసలు పొందింది. మహతి పప్పుల పేరుతో యూట్యూబ్ చానల్‌లో ఆమె పాడిన పాటలను అప్‌లోడ్ చేయగా.. వేలాది మంది చూస్తున్నారు.
ఆది గురువు అమ్మే..
మహతి మూడో తరగతి చదువుతున్నపుడే తల్లి నవనీత ఆధ్యాత్మిక అంశాలు, పద్యాలు, పాటల ను నేర్చుకునేలా ప్రోత్సహించింది. తల్లి చెబుతుంటే తాను వినిపాడడం ద్వారా పాటలపై ఆసక్తిని పెంచుకుని, సంగీతం నేర్చుకుంది. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో ఆమె ఎన్నో పాటలు పాడింది. ఏడాది క్రితం తల్లి నవనీత అనారోగ్యంతో చనిపోవడంతో మహతి ఎంతగానో కుమిలిపోయింది. ‘అమ్మా.. వినమ్మా’ అంటూ తన తల్లిపై రాసి పాడిన పాట ఎందరినో కంటతడి పెట్టించింది.
సంగీతమే లోకంగా జీవిస్తున్న మహతి తాను నేర్చుకున్నది నలుగురికి పంచాలనే ఉద్దేశంతో పలువురికి నేర్పిస్తోంది. ఇంటి దగ్గరకు వచ్చే చిన్నారులతో పాటు ఆన్‌లైన్‌లో కూడా సంగీత పాఠాలు చెబుతోంది. ఇప్పటికే యాభై మందికిపైగా ఆమె వద్ద సంగీతం నేర్చుకున్నారు. కాగా కర్ణాటక సంగీతంలో పలు కోర్సులు పూర్తి చేసిన మహతి.. మరిన్ని ఉన్నత కోర్సులు చేయడానికి రెడీ అవుతోంది. అలాగే హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకుంటోంది.
చిన్నప్పుడు అమ్మ చెప్పిన నీతి కథలు, భక్తి గేయాలే నన్ను సంగీతం, ఆధ్యాత్మికతవైపు నడిపించాయి. వెన్నంటి నిలిచి అన్నీ నేర్చుకునేలా ప్రోత్సహించింది. కావలసినవన్నీ నాన్న సమకూర్చాడు. అమ్మ అర్ధంతరంగా ఈ లోకాన్ని వీడడం తీరని లోటు. ఆమె ఇచ్చిన ధైర్యంతో నా లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకు సాగుతున్నా.
– పప్పుల మహతి, గాయని, కామారెడ్డి


