కామారెడ్డి టౌన్ : మహిళలు, బాలికలను ఉద్యోగా లు, వివాహాల పేరుతో మోసగించి మానవ అక్రమ రవాణాకు గురిచేసే ముఠాల విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌వీఆర్‌ఆర్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా సమాఖ్య భవనంలో ఐకేపీ మండల మహిళా ప్రతినిధులకు ‘మానవ అక్రమ రవాణా, వాణిజ్య లైంగిక దోపిడి’ అనే అంశంపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసు విభాగాలు, షీ టీం, ఐకేపీ సహకారంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా తీవ్రమైన నేరమన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉంటాయన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పోక్సో చట్టం చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. బాల్య వివాహాల నివారణకు మహిళలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ మోసపోయిన బాధితులు భయపడకుండా ముందుకు వస్తే ఉచితంగా న్యాయ రక్షణ అందిస్తామన్నారు. సదస్సులో పోలీసు కళాబృందం సభ్యులు మహిళల భద్రత, బాలల రక్షణ, చట్టాలపై ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సై రామన్, ఏపీఎం శ్రీనివాస్, పీసీ రాజేందర్, షీ టీం ప్రతినిధి సౌజన్య, పోలీస్ కళాబృందం ప్రతినిధి ఛత్రపతి, డీఎల్‌ఎస్‌ఏ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిబ్బంది, ఐకేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.


