మాల్తుమ్మెద గేట్‌ వద్ద.. | - | Sakshi
Sakshi News home page

మాల్తుమ్మెద గేట్‌ వద్ద..

May 17 2026 1:18 AM | Updated on May 17 2026 1:18 AM

నాగిరెడ్డిపేట: లారీలు సకాలంలో రాకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయని మాల్తుమ్మెద గేట్‌ వద్ద జాతీయ రహదారిపై రైతులు శనివారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాల్తుమ్మెద సర్పంచ్‌ సాయిలు మాట్లాడుతూ రోజుల తరబడి లారీలు రాకపోవడం వల్ల తూకం చేసిన ధాన్యం బస్తాలు కేంద్రంలోనే ఉండిపోతున్నాయన్నారు. ఎండలతో రోజురోజుకు వడ్ల సంచుల బరువు తగ్గి నష్టపోతున్నామన్నారు. దీంతో మిల్లులకు తరలిన తర్వాత కూడా కోత విధిస్తున్నారని, లారీల డ్రైవర్లు సైతం బస్తాకు రెండు మూడు రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఇన్‌చార్జి ఎస్సై సుబ్రహ్మణ్యచారి తమ సిబ్బందితో మాల్తుమ్మెద గేట్‌ వద్దకు చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో నాగిరెడ్డిపేట ఆర్‌ఐ మహేశ్‌ చంద్ర అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలకు లారీలను వెంటవెంటనే పంపాలని, తూకం చేసిన ధాన్యంలో కోత విధిస్తున్న రైస్‌మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐకి వినతిపత్రాన్ని అందించి రైతులు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement