కామారెడ్డి అర్బన్: కేంద్ర ప్రభుత్వ వైఫలమే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అని భారతీయ విద్యార్థి మోర్చా(బీవీఏం) రాష్ట్ర అధ్యక్షుడు భూంపల్లి రవితేజ ఆరోపించారు. కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో శనివారం రవితేజ మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో నీట్‌లోని వందకు పైగా ప్రశ్నలు ముందు లీక్ కావడం అనేది లక్షాలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మానసిక, ఆర్థిక వేదనకు గురిచేసిందన్నారు. లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో లీకేజీలు లేని నమ్మకమైన పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీవీఏం జిల్లా కన్వీనర్ రోహిత్, కో–కన్వీనర్ భరత్, నాయకులు లింగం, సాయినాథ్, విజయ్‌అరుణ్, కార్తీక్, భాను పాల్గొన్నారు.
దోమకొండ: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన మెడిసిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన దాదాపు 150 మందికి ఉచితంగా పలు రకాల పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డుసభ్యులు, మెడిసిటీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుందకు చెందిన మంచివార్ యోగేష్‌ను జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శనివారం బిచ్కుంద పార్టీ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. యోగేష్ కొన్ని నెలల నుంచి క్రమశిక్షణ పాటించకుండా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో విచారణ చేపట్టి పదవి నుంచి తొలగించినట్లు తెలిపారు. నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ఇమ్రోజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అజీం పాల్గొన్నారు.
● సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్: గంజాయి, మత్తు పదార్థాల కేసుల్లో మళ్లీ పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగదారులకు శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈగల్ టీం ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాల వినియోగంతో యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. గతంలో గంజాయి, మత్తుపదార్థాల కేసులలో దొరికిన వారు మళ్లీ దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ శ్రీరామ్ చంద్రరావు, ఏసీపీ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈగల్ టీం డీఎస్పీ సోమనాథం తదితరులు పాల్గొన్నారు.


