నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

కాపీయింగ్‌కు తావులేకుండా.. ఉదయం ఫస్టియర్‌.. మధ్యాహ్నం సెకండియర్‌..

జిల్లాలో 8,618 మంది విద్యార్థులు..

31 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా మొత్తం 8,618 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం నుంచి 5,561 మంది (జనరల్‌ 4,774, వొకేషనల్‌ 787), ద్వితీయ సంవత్సరం నుంచి 3,057 మంది (జనరల్‌ 2,538, వొకేషనల్‌ 519) పరీక్షలు రాయనున్నారు. మొత్తం విద్యార్థుల్లో బాలికలు 5,170 మంది కాగా, బాలురు 3,448 మంది ఉన్నారు.

పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌ను నియమించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 200 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారు. మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లతోపాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం సూచించారు. మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement