నీట్‌ పరీక్ష రద్దుతో నిరాశ! | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్ష రద్దుతో నిరాశ!

May 13 2026 12:56 AM | Updated on May 13 2026 12:56 AM

మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిందే..

మళ్లీ రాయాల్సిన పరిస్థితి

ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : డాక్టర్‌ కావాలన్న లక్ష్యంతో కష్టపడి జాతీయ అర్హత పరీక్ష (నీట్‌) రాసిన విద్యార్థులు.. ప్రశ్నపత్రం లీకయ్యిందని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. పరీక్ష రద్దుతో నిరాశకు గురవుతున్నారు.

జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు మెడిసిన్‌ చదవాలన్న లక్ష్యంతో ఇంటర్మీడియట్‌ బైపీసీ పూర్తి చేసి నీట్‌కు సన్నద్ధమయ్యారు. సుమారు ఐదు వేల మంది వరకు ఈనెల 3న నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. ఇందుకోసం రెండేళ్ల పాటు అంటు ఇంటర్‌తోపాటు నీట్‌ కోసం ప్రిపేర్‌ అయ్యారు. మరికొందరు లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నారు. పరీక్ష పూర్తవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కీ చూసుకుని ఎన్ని మార్కులు వస్తాయన్న దానిపై లెక్కలు వేసుకుని తమకు ఎక్కడ మెడిసిన్‌ సీటు వస్తుందన్న దానిపై ఓ అంచనాకు వచ్చారు.

ఎంబీబీఎస్‌తో పాటు బీడీఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీఏఎంఎస్‌ తదితర కోర్సులన్నింటికీ నీట్‌ ద్వారానే సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు మొదట ఎంబీబీఎస్‌కు ప్రాధాన్యతనిస్తారు. ఎంబీబీఎస్‌లో సీటు రాకుంటే బీడీఎస్‌తో పాటు ఇతర కోర్సుల్లో చేరాలనుకుంటారు. కొందరు విద్యార్థులు తమకు సీటు రాని పక్షంలో మరో ఏడాది లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌కూ వెళతారు. మెడిసిన్‌ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రాత్రింబవళ్లు చదివిన వారంతా నీట్‌ పరీక్ష రద్దయిందని తెలియడంతో మనోవేదనకు గురవుతున్నారు. ఇంతకాలం హాస్టళ్లలో ఉండి ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన వారు.. మళ్లీ పరీక్ష రాయాలంటే ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈసారి కీ చూసుకున్న తర్వాత తమకు సీటు గ్యారంటీగా దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారు.. మళ్లీ పరీక్ష రాస్తే తమకు అన్ని మార్కులు వస్తాయో లేదోననే ఆందోళన చెందుతున్నారు. నీట్‌ పరీక్ష రద్దుతో తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉన్నారు. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహించే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. విద్యార్థులు మాత్రం అప్పుడే పుస్తకాలతో కుస్తీ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement