బడిలో సామగ్రి భద్రమేనా? | - | Sakshi
Sakshi News home page

బడిలో సామగ్రి భద్రమేనా?

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

హెచ్‌ఎంలు పర్యవేక్షిస్తున్నారు..

ఎల్లారెడ్డి: ప్రహరీలు లేని భవనాలు.. వాచ్‌మెన్లు అసలే ఉండరు.. రాత్రి కాగానే ఆకతాయిలకు మందు బాబులకు అడ్డాలు.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. వేసవి సెలవుల కారణంగా ఏప్రిల్‌ నెలాఖరులో మూతబడ్డ పాఠశాలలు జూన్‌లో తెరుచుకుంటాయి. అప్పటివరకు ఎలాంటి రక్షణ లేని ఇలాంటి భవనాలలో లక్షల రూపాయలు ఖరీదు చేసే కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, డిజిటల్‌ స్క్రీన్లు తదితర వస్తువులు పడి ఉంటున్నాయి. అలాగే వేసవి సెలవులకు ముందు పలు ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన బియ్యం భద్రంగానే ఉన్నాయా అన్న ప్రశ్న పలువురిలో నెలకొంది.

ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు..

ఎల్లారెడ్డి మండలంలో 44 ప్రాథమిక, 4 యూపీఎస్‌, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇవేకాకుండా కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌, మైనారిటీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో కనీసం ఒక కంప్యూటర్‌, డిజిటల్‌ ప్రొజెక్టర్‌, స్క్రీన్‌ తదితర వస్తువులు ఖచ్చితంగా ఉంటున్నాయి. కళ్యాణి గ్రామంలోని పాఠశాలలో పిల్లలకు ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) విద్య నేర్పేందుకు మండల పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికై ంది. దీంతో బడిలో దాదాపు 10 వరకు అత్యాధునిక కంప్యూటర్లు, డిజిటల్‌ స్క్రీన్లు ఉన్నాయి. అలాగే ప్రతీ విద్యాలయంలోనూ బియ్యం నిల్వలు సైతం బాగానే ఉన్నాయి. ప్రతీ గురుకుల పాఠశాల, మోడల్‌ స్కూళ్లలో వాచ్‌మెన్‌లు ఉంటారు కాబట్టి రక్షణ ఉండే అవకాశం ఉంది. కానీ మిగితా ఏ పాఠశాలలోనూ వాచ్‌మెన్లు ఉండకపోవడంతో వాటికి రక్షణ కరువైంది.

ఆకతాయిలకు అడ్డాలు..

గ్రామీణ ప్రాంతాలలోని బడులు రాత్రి వేళల్లో మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. వారు పాఠశాలలో మద్యం తాగడమే కాకుండా మందు సీసాలను పగలగొట్టి నానా హంగామా చేస్తున్నారు. గేట్లకు తాళాలు వేసినా వాటిని పగలగొట్టి పాఠశాలలోకి వెళుతున్నారు. అంతేగాక పాఠశాలల్లో విలువైన వస్తువులు, బియ్యం ఉన్నాయని తెలిస్తే దొంగలు పాఠశాలల తలుపులు పగలగొట్టి ఎత్తుకెళ్లే అవకాశం ఉంది.

అందరి భాగస్వామ్యం ఉంటేనే..

విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతీ పాఠశాల హెడ్‌మాస్టర్‌ ప్రతీ రెండు రోజులకోసారి స్కూల్‌ను విజిట్‌ చేసి పరిస్థితిని పరిశీలించాల్సి వస్తుంది. కొందరు హెచ్‌ఎంలు స్థానిక పెద్దలతో మాట్లాడి స్కూల్‌ సంగతి చూడమని కోరుతున్నారు. మరికొందరు పట్టణ ప్రాంతాల్లో పోలీసులను పెట్రోలింగ్‌ చేయమని కోరుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల రక్షణ పెద్ద సమస్యగా మారుతున్నది. ఈక్రమంలో పాఠశాలల్లోని విలువైన వస్తువులను రక్షించుకోవడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎవరో ఒకరు పాఠశాల పరిసరాలను పరిశీలిస్తుండాలి. ఎవరైనా ఆకతాయిలు, మందు బాబులు పాఠశాల పరిసరాలలో కనిపిస్తే నివారించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే పాఠశాలను రక్షించుకోవచ్చు .

విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు ప్రతీ రెండు రోజులకోసారి బడుల ను సందర్శించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పాఠశాల ఆస్తులను రక్షించుకోవాలని ఎస్‌ఎంసీ బాధ్యులకు, స్థానిక సర్పంచులకు కోరాం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ఉన్న విలువైన వస్తువులను కాపాడుకోవడంలో భాగస్వామ్యం కావాలి

–రాజులు, ఎంఈవో, ఎల్లారెడ్డి

వేసవి సెలవుల కారణంగా

పాఠశాలలకు తాళాలు

గదుల్లో రూ.లక్షల విలువచేసే

కంప్యూటర్లు, ఇతర పరికరాలు

రాత్రివేళల్లో పర్యవేక్షణ కరువు

Advertisement
 
Advertisement
Advertisement