● ఉత్తమ టీచర్‌గా పలు అవార్డులు
● ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయురాలు
గాంధారి(ఎల్లారెడ్డి): అంకితభావంతో చిన్నారులకు విద్యాబోధన చేస్తూ ఉత్తమ టీచర్‌గా పలు అవార్డులు అందుకుంటున్నారు మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు భవాని. మండల కేంద్రంలో బాలికల ప్రాథమిక పాఠశాలకు భవాని 2018లో బదిలీపై వచ్చారు. అప్పుడు కేవలం 40 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేవారు. భవాని గ్రామంలో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. చిన్నారులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేస్తూ క్రమంగా విద్యార్థుల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం పాఠశాలలో 140 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఆటలు, పాటలు, కంప్యూటర్ పాఠాలు కూడా బోధిస్తున్నారు. సొంత డబ్బులతో పాఠశాలకు ఒక కంప్యూటర్లను సమకూర్చి కంప్యూటర్ పరిజ్ఙానం కల్పిస్తున్నారు. ఆమె సేవ, కృషిని గుర్తించిన సంబంధిత అధికారులు పలుమార్లు మండల ఉత్తమ టీచర్‌గా ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇటీవలే రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ ఎంపికై సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. ఇతర దేశాల్లో విద్యాబోధన పరిశీలన కోసం వెళ్లిన ఉపాధ్యాయుల బృందంలో చోటు దక్కించుకుని విదేశాల్లో కూడా ఆమె పర్యటించారు.


