మూడు ఇళ్లలో చోరీ
వర్ని: మండలంలోని శ్రీనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన వజ్రమ్మ, రమణ, శ్రీనివాసరావు ఇళ్లలో చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లలో కలిపి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా తీసుకొని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పరిశీలించారు. వేసవికాలంలో డాబాల మీద పడుకున్న, ఇతర ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.


