ముందడుగేది..? | - | Sakshi
Sakshi News home page

ముందడుగేది..?

May 11 2026 7:32 AM | Updated on May 11 2026 7:32 AM

మహాప్రస్థానంకు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : లక్షకు పైగా జనాభా ఉన్న కామారెడ్డి పట్టణంలో శ్మశాన వాటికలు అధ్వానంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అంతిమ సంస్కారాల సందర్భంగా ఇబ్బందిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ గతనెల 20న ‘అంతిమ కష్టాలు’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇది కథనం వైరల్‌ అయ్యింది. అదేరోజు జరిగిన మున్సిపల్‌ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ‘సాక్షి’ కథనాన్ని చూపుతూ సమస్యను లేవనెత్తారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ కథనాన్ని చదివి చలించిన బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి సొంత డబ్బులతో శ్మశానాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు. పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతనెల 27న ఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ప్రతినిధులు జిల్లా అధికారులను కలిసి లేఖ అందించారు. ఈ వినతిని పరిశీలించాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి బల్దియా కమిషనర్‌ను ఆదేశించారు.

ఎటూ తేల్చలేకపోతున్న అధికారులు

శ్మశాన వాటికను సొంత డబ్బులతో అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా.. అనుమతులు ఇచ్చే విషయంలో బల్దియా అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. బీజేపీతోపాటు కాంగ్రెస్‌ పార్టీలోని ఓ వర్గం కూడా సదరు స్వచ్ఛంద సంస్థ నిర్ణయాన్ని స్వాగతించాయి. పలు కుల సంఘాలూ మద్దతు ప్రకటించాయి. అయినా అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బులతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన వారిని అభినందించి సహకరించాల్సిన అధికారులు.. ఈ వ్యవహారంలో నాన్చుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చొరవ చూపి వైకుంఠధామంలో సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కష్టాల కాష్టం...

కామారెడ్డి పట్టణంలో ఉన్న రెండు శ్మశాన వాటికల్లోనూ అనేక సమస్యలున్నాయి. శ్మశానానికి సంబంధించిన భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన కొద్ది స్థలంలో అన్ని వసతులను కల్పించేందుకు గత ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు మధ్యలో ఆగిపోవడంతో సమస్యలు అలాగే ఉండిపోయాయి. ప్రధానంగా హౌసింగ్‌ బోర్డు కాలనీ సమీపంలోని శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్‌ చేసింది. గతేడాది ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో చెరువు అలుగు ఉప్పొంగి వాగు వేగంగా ప్రవహించడంతో శ్మశాన వాటికి ప్రధాన గేటు వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడచినా తట్టెడు మట్టిపోయకుండా వదిలేశారు. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం, విద్యుత్‌ సౌకర్యాలు లేవు. ఒకేసారి రెండు మృతదేహాలను మాత్రమే దహనం చేయడానికి అవకాశం ఉంది. మూడో వ్యక్తి చనిపోతే కాడు ఎక్కడ పేర్చాలో తెలియని పరిస్థితి.. అంత్యక్రియల సందర్భంగా స్నానాలు చేయడానికి ట్యాంకర్‌ను తెచ్చుకోవాల్సిదే. ఇలాంటి దయనీయ పరిస్థితుల మధ్య అంత్యక్రియలు జరుగుతున్నాయి.

జిల్లాకేంద్రంలో అధ్వానంగా

‘వైకుంఠధామం’

సమస్యలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ

స్వాగతించిన బీజేపీ, అధికార పార్టీలోని ఒక వర్గం

అనుమతుల విషయాన్ని

నానబెడుతున్న బల్దియా

పక్షం రోజులవుతున్నా ఏ విషయం

తేల్చని అధికారులు

సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రజలు

జిల్లాకేంద్రంలో అధ్వానంగా ఉన్న వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా.. అనుమతులు ఇవ్వడంలో బల్దియా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏ నిర్ణయం చెప్పకుండా కాలయాపన చేస్తుండడంపై ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. శ్మశాన వాటికలో సమస్యల పరిష్కారం, వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement