కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య బస్టాండ్‌లో ప్రయాణికురాలి పర్సులోనుంచి బంగారం, నగదు చోరీ

భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డిలో పిండి గిర్ని శుభ్రం చేస్తూ ఓ మహిళ విద్యుత్‌ షాక్‌తో శనివారం మృతి చెందింది. గ్రామానికి చెందని బండి రేణుక (35) తన ఇంట్లోనే పిండిగిర్ని ఏర్పాటు చేసుకుంది. శనివారం ఉదయం యంత్రాన్ని నీటితో శుభ్రం చేస్తుండగా విద్యుత్‌షాక్‌ కొట్టింది. వెనక్కిపడిపోయిన రేణుక తలకు తీవ్రగాయం కాగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

భిక్కనూరు: తల్లి మందలించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన జిల్లెల బాలమణి రెండో కుమారుడు బాపురెడ్డి (25) తల్లితో కలిసి వ్యవసాయం చేసేవాడు. ధాన్యాన్ని ఆరబోసే విషయంలో గురువారం సాయంత్రం బాలమణితో బాపురెడ్డి గొడవపడ్డాడు. ఆ తరువాత బయటికి వెళ్లిన బాపురెడ్డి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం భిక్కనూరు బొబ్బిలి చెరువలో యువకుడి మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఒడ్డుకు తీసుకువచ్చి మృతుడిని రామేశ్వర్‌పల్లికి చెందిన జిల్లెల బాపురెడ్డిగా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కామారెడ్డి క్రైం: ప్రయాణికురాలి పర్సులో నుంచి బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైన ఘటన కామారెడ్డిలోని కొత్త బస్టాండ్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని చితంల్‌లో నివాసం ఉండే మహిళ తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు కామారెడ్డికి వచ్చి తిరుగు ప్రయాణమైంది. బస్సు ఎక్కిన తరువాత పర్సును చూసుకోగా నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ బస్సు ఎక్కే క్రమంలో చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement