పుట్టెడు దుఃఖం.. పిల్లలే లోకంగా జీవనం | - | Sakshi
Sakshi News home page

పుట్టెడు దుఃఖం.. పిల్లలే లోకంగా జీవనం

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

● బిడ్డలకు సేవచేస్తూ బతుకుతున్న తల్లులు ● అమ్మతనానికి నిలువెత్తు రూపాలు.. ● నేడు మాతృ దినోత్సవం

ముప్పై ఏళ్లుగా..

కడుపున పుట్టిన బిడ్డల మానసిక, శారీరక లోపాలను వారు శాపంగా చూడలేదు. వారిని భారంగా భావించలేదు. ఏళ్లు మీదపడుతున్నా ఆరోగ్యం మెరుగుపడదని తెలిసినా సరే వదిలించుకోవాలనుకోలేదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో, పిల్లల కోసమే బతుకుతున్నారు. తమంత ఎత్తు పెరిగినా చంటి పిల్లల్లా భావిస్తూ సపర్యలు చేస్తూ అమ్మతనానికి మరింత వన్నె తెస్తున్నారు. జిల్లాలో పలువురు తల్లుల త్యాగనిరతిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

దుఃఖాన్ని దిగమింగుకుని..

ఎల్లారెడ్డిరూరల్‌: ‘‘అప్పుల బాధతో నా భర్త నర్వ నారాయణ ఆత్మహత్య చేసుకున్నడు. ఆయన చనిపోయిన సమయంలో పెద్దకొడుకు సిద్దిరాములుకు ఎనిమిదేళ్లు, చిన్నకొడుకు నాగరాజుకు ఆరేళ్లు. ఓవైపు అప్పులు.. మరోవైపు పుట్టెడు దుఃఖం.. అయినా పిల్లల కోసం బతకాలనుకున్నా. పొలం పనులు చూసుకుంటూ పిల్లలను పెంచి పెద్దచేసిన. పెద్ద కొడుకు ఉప సర్పంచ్‌ అయ్యిండు. చిన్న కుమారుడు నాగరాజు బాసర త్రిపుల్‌ ఐటీలో చదివిండు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఎన్‌ఐటీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తుండు’’ అని జంగమాయిపల్లికి చెందిన సిద్ధవ్వ పేర్కొంది.

ఇప్పటికీ పసి పాపే..

కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్‌లో నివసించే బూక్య రజిత, రాజునాయక్‌లకు కూతురు, కొడుకు ఉ న్నారు. బిడ్డ బూక్య లక్కీకి పుట్టుకతోనే ఆరోగ్య సమ స్య ఉంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కదిలే స్థితిలోలేని బిడ్డ ను కంటిపాపలా చూసుకుంటున్నారు. రజితకు భర్త రాజునాయక్‌ ఆసరా అవుతారు. 16 ఏళ్లుగా సేవలు చేస్తున్నా ఏ నాడూ భారంగా అనిపించలేదని చెబుతోంది రజిత. లక్కీని అందరూ ఎంతో ప్రేమగా చూస్తారని తెలిపింది. బిడ్డను చూసుకుంటూనే రజిత లా చదువుతోంది.

కూతురికి అన్నీ తానై..

ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్‌ గ్రామానికి చెంది న బోరంచ లక్ష్మి, దుర్గయ్య దంపతులకు కూతురు రేణుక ఉంది. ఆమెకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబమైనా.. కన్న కూతురును 19 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఆ అమ్మ. కూలినాలి చేసుకుంటూ బిడ్డకు అన్ని సపర్యలు చేస్తూ కాపాడుకుంటోంది.

తల్లి సిద్దవ్వతో నాగరాజు

కామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్‌ కాలనీకి చెందిన సూరం సంతోష, వెంకటేశ్‌లది రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం. వారికి 33 ఏళ్ల కూతురు అశ్విని, 31 ఏళ్ల కుమారుడు శ్రీనివాస్‌ ఉన్నారు. ఇద్దరూ మాట్లాడలేరు.. నడవలేరు. కనీసం నిలబడలేరు. 2010లో భర్త వెంకటేశ్‌ చనిపోవడంతో పిల్లల పూర్తి బాధ్యత సంతోషపైనే పడింది. పిల్లలే లోకంగా బతుకుతున్న సంతోష.. వారికి సేవలు చేస్తూ, ఇంట్లోనే బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజూ పొద్దున్నే పిల్లలు బ్రష్‌, స్నానం చేయించి, ఏదైనా తినిపించి కూర్చోబెట్టాల్సిందే. కాలకృత్యాలకు తీసుకెళ్లి శుభ్రం చేయాలి. పిల్లలను వదిలి ఎటూ వెళ్లలేని పరిస్థితి. పిల్లలను కూర్చోబెట్టి బయట డోర్‌ లాక్‌ చేసి మార్కెట్‌కు వెళ్లొస్తుంటానని చెబుతోంది. పిల్లలకు సేవ చేస్తూ, వారిని చూసుకుంటూ బతుకుతున్నానని తెలిపింది.

ఇద్దరు కుమారులతో తల్లి రామకిష్టవ్వ

ఆనందంగా సాగిపోతున్న వారి జీవితాల్లో విధి కల్లోలం రేపింది. జంగమాయిపల్లికి చెందిన నర్వ సిద్దవ్వ భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా.. మల్కాపూర్‌కు చెందిన కొండ రామకిష్టవ్వ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి జీవితంలో అంధకారం అలుముకుంది. అయినా వారు తమ పిల్లల కోసం దుఃఖాన్ని దిగమించుకుని ముందుకు సాగారు. కష్టపడి పిల్లలను పెంచి ప్రయోజకులను చేశారు. – ఎల్లారెడ్డి రూరల్‌

ప్రయోజకులను చేసిన..

ఎల్లారెడ్డిరూరల్‌: ‘‘నా భర్త కొండ లచ్చయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన లేకుండా బతుకుడెట్లా అనుకున్న. మాకు ఇద్దరు పిల్లలు. వారిని ప్రయోజకులుగా చేయాలనుకున్న. వ్యవసాయం చేస్తూ చదివించిన. పెద్ద కొడుకు వంశి అగ్నివీర్‌లో ఎంపిక జమ్మూకశ్మీర్‌లో ఉద్యోగం చేస్తున్నడు. చిన్న కొడుకు ఇంటర్‌ వరకు చదివిండు. వ్యవసాయంలో తోడుంటున్నడు’’ అని మల్కాపూర్‌కు చెందిన కొండ రామకిష్టవ్వ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement