● పదిలో ఏటా శతశాతం ఉత్తీర్ణత
● ట్రిపుల్ ఐటీకి పలువురు ఎంపిక
● ఆదర్శంగా నిలుస్తున్న
దోమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాల
దోమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఈ పాఠశాలలో మూడుసార్లు శతశాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం.
దోమకొండ : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాలలో అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నారు.
2022–23 విద్యా సంవత్సరంలో 49 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా.. అందరూ పాసయ్యారు. ఆ ఏడాది బాసర ట్రిపుల్ ఐటీకి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 82 కు చేరింది. ఇందులో ఒక్కరు మినహా మిగిలిన అందరూ ఉత్తీర్ణులయ్యారు. నలుగురికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. 2024–25 విద్యా సంవత్సరంలో 70 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరు ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించారు. గత విద్యా సంవత్సరంలో 80 మంది విద్యార్థులకు 80 మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పావని 582 మార్కులతో జిల్లాస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల టాపర్‌గా నిలిచింది. భవాని 578 మార్కులు, అమూల్య 576 మార్కులు, భవిష్య 575 మార్కులు, షఫియా 573 మార్కులు, రసజ్ఞ 570 మార్కులతో సత్తా చాటారు.
గత విద్యాసంవత్సరంలో పాఠశాలలో 334 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో పాఠశాలకు గదుల కొరత ఉండగా, రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిధులతో అదనపు గదులు నిర్మించారు. దీంతో గదుల సమస్య పరిష్కారమైంది. ఈ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య సైతం అందుతోంది. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. పలు క్రీడాంశాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు. ఉపాధ్యాయులు సైన్స్‌ఫేర్‌తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థినుల్లో నృజనాత్మకతను పెంపొందిస్తున్నారు.
పాఠశాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. సబ్జెక్ట్ వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తున్నారు. చదువుతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారిలో సృజనాత్మకత పెంపొందేలా చూస్తున్నాం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
– శరత్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు, దోమకొండ


