కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 200 కాలనీలలో 25 వేల గృహాలున్నాయి. సుమారు లక్షకుపైగా జనాభా నివసిస్తున్నారు. పట్టణ నీటి అవసరాలు తీర్చడం కోసం రోజూ 12 ఎంఎల్‌డీ (మెగాలీటర్స్ పర్ డే) అవసరం. కానీ క్షేత్రస్థాయిలో అందుతున్నది 6 ఎంఎల్‌డీ మాత్రమే. అంటే అవసరంలో సగం నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో నల్లాల ద్వారా రెండు రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. అవి కూడా తక్కువ ప్రెషర్‌తో వస్తుండడంతో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న శివారు కాలనీలకు నీరు అందడం లేదు.
పైప్‌లైన్ల నిర్వహణ సరిగా లేక..
పట్టణంలో 300లకు పైగా మున్సిపల్ బోర్లు, 70కి పైగా కమ్యూనిటీ బోర్లు ఉన్నాయి. వీటితో పాటు పట్టణానికి శ్రీరాంసాగర్‌నుంచి గోదావరి జలాలు సరఫరా అవుతున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువు, బుర్రమత్తడి ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. అయితే పైప్‌లైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో నీటి సమస్య తలెత్తుతోంది.
నత్తనడకన ‘అమృత్’..
కేంద్ర ప్రభుత్వం రూ. 90 కోట్లతో చేపట్టిన అమృత్ పథకం పనులు పట్టణంలో నత్తనడకన సాగుతున్నాయి. ఈ నిధులతో పట్టణంలో ఏడుచోట్ల భారీ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. అయితే ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పైప్‌లైన్ల అనుసంధానం పూర్తి కాకపోవడంతో మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందడం లేదు. ఎక్కడ చూసినా తవ్వి వదిలేసిన గుంతలే తప్ప కుళాయిల్లో నీటి గలగలలు వినిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
అల్లాడుతున్న కాలనీలు..
పట్టణంలో ప్రధానంగా గోసంగి కాలనీ, రాజీవ్‌నగర్, డ్రైవర్స్ కాలనీ, బతుకమ్మకుంట, అశోక్‌నగర్, శ్రీరామ్‌నగర్, విద్యానగర్, రుక్మిణికుంట, స్నేహపూరి కాలనీ, లింగాపూర్, టేక్రియాల్, పాత రాజంపేట్, ఇల్చీపూర్ తదితర కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు నిరీక్షిస్తుంటారు.
ఎండలతోపాటే కామారెడ్డి బల్దియాలో తాగునీటి కష్టాలు పెరుగుతున్నాయి. సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. పాలకులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. తాగునీటి ఎద్దడికి సాక్ష్యంగా పలు కాలనీలలో ఏ ఇంటి ముందు చూసినా డ్రమ్ములు దర్శనమిస్తున్నాయి.
– కామారెడ్డి టౌన్
కామారెడ్డిలో అసంపూర్తిగా
‘అమృత్’ పనులు
సరిపడా సరఫరా కాని నీరు
ప్రతి ఇంటిముందు డ్రమ్ములు..
ఏటా ఇదే పరిస్థితి
పట్టించుకోని పాలకులు


