మూడేళ్లుగా పదో తరగతిలో విద్యార్థులు, ఉత్తీర్ణత వివరాలు..
● ప్రైవేట్‌కు దీటుగా సౌకర్యాలు
కల్పిస్తున్న పూర్వ విద్యార్థులు
● ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న
నెమ్లి హైస్కూల్
నస్రుల్లాబాద్ : బతుకు బాటలు వేసిన బడికి అండగా నిలుస్తున్నారు పలువురు పూర్వ విద్యార్థులు. తాము చదివిన పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. దీంతో ఆ పాఠశాల పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది.
నెమ్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెమ్లితోపాటు హాజీపూర్, సంగం, అంకోల్, అంకోల్ క్యాంపు, అంకోల్ తండా, నాచుపల్లి, కామిశెట్టిపల్లి, బైరాపూర్, లింగంపల్లి, దుర్కి, మీర్జాపూర్, దేశాయిపేట్ గ్రామాల నుంచి విద్యార్థులు చదువుతున్నారు. గత విద్యాసంవత్సరంలో 381 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ పాఠశాల అభివృద్ధి కోసం నాలుగేళ్ల క్రితం పూర్వ విద్యార్థులు ఒక్కటయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటైన వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చారు. విరాళాలు సేకరించి పాఠశాల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన డెస్క్ బెంచీలను అందించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. ఏడాదిగా ఇద్దరు స్కావెంజర్లకు జీతాలు అందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ వద్ద రూ. 7లక్షలు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకోసం ఈ నిధిని సమీకరించి ఉంచారు.
ఎస్సెస్సీలో మంచి ఫలితాలు..
సౌకర్యాలు మెరుగవడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించగలుగుతున్నారు. ఉపాధ్యాయులు నాణ్య మైన విద్య అందిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏటా పదో తరగతిలో విద్యార్థుల సంఖ్యతోపాటు ఫలితాలూ మెరుగవుతూ వస్తున్నాయి. 2024లో పదో తరగతిలో 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. 2025లో 97 శాతం పాస్ అయ్యారు. ఈసారి 99 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్, అప్పేరల్ కోర్సుల్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ పాఠశాలనుంచి ఏటా ఎన్‌ఎంఎం స్కాలర్‌షిప్‌నకు ముగ్గురు చొప్పున ఎంపికవుతున్నారు. రెండేళ్లుగా ట్రిపుల్‌ఐటీకి ఒక్కొక్కరు ఎంపికవుతూ వస్తున్నారు.
విద్యాసంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైనవారు ఉత్తీర్ణత శాతం
2023–24 94 82 87.23
2024–25 94 92 97.87
2025–26 117 116 99.14


