● గడువులోగా ధాన్యం సేకరణ
పూర్తి చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు హమాలీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కేంద్రం నిర్వాహకులు చూడాలని సూచించారు. తూకాలు వేగంగా పూర్తి చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. మెప్మా సంఘానికి వచ్చే కమీషన్ మొత్తాన్ని సభ్యులందరికీ ప్రయోజనం చేకూరేలా వినియోగించాలని, తద్వారా సంఘం ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ధాన్యం కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతతో పనులు చేపట్టాలి
కామారెడ్డి క్రైం: భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలో రూ. 5 కోట్లతో నిర్మాణంలో ఉన్న జిల్లా ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25 లోగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ భవనం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, పీఆర్ డీఈఈ స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.


