కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి

May 9 2026 7:50 AM | Updated on May 9 2026 7:50 AM

కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి గంప గోవర్ధన్‌తో భేటీ విద్యార్థులకు అభినందనలు కూలి రేట్లపై చర్చల్లో పురోగతి త్రుటిలో తప్పిన ప్రమాదం

కామారెడ్డి టౌన్‌: రాష్ట్ర బడ్జెట్‌లో వృత్తిదారుల కార్పొరేషన్లకు నామమాత్రపు నిధులు కేటాయించడంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ ఎస్‌. వెంకట్‌ గౌడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్‌ నిధులు విడుదల కాకపోవడంతో కార్పొరేషన్లు నిర్వీర్యమవుతున్నాయని, నిధులు లేని చోట చైర్మన్ల నియామకం వల్ల అదనపు భారమే తప్ప ఒరిగేదేమీ లేదని విమర్శించారు. నూతనంగా నియమితులైన చైర్మన్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టాలని, వృత్తుల ఆధునీకరణకు కృషి చేయాలని కోరారు.

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ కో–ఆప్షన్‌ సభ్యుడిగా నూతనంగా ఎన్నికై న కుంబాల రవి యాదవ్‌ శుక్రవారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఎన్నికకు సహకరించినందుకు గంప గోవర్ధన్‌తో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు హఫీజ్‌ బేగ్‌, ప్రభాకర్‌ యాదవ్‌, పిట్ల వేణు, స్వప్న లక్ష్మీనారాయణ, మామిండ్ల లక్ష్మణ్‌, లోలపు శ్రీనివాస్‌, అజాజ్‌, మన్సూర్‌, గోపు బాలమణి తదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ధర్మారావ్‌పేట్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై న గీతం, రసజ్ఞ, రిత్విక్‌, అఖిల, నవ్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో యోసెఫ్‌, పీడీ శ్రీనివాస్‌లు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 17న హైదరాబాద్‌లో జరుగనున్నట్లు వారు పేర్కొన్నారు. సర్పంచ్‌ ఉమర్‌, ఉప సర్పంచ్‌ అశోక్‌ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు ప్రమీలమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

దోమకొండ: రాష్ట్రంలోని ఆరు లక్షల మంది బీడీ కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ ఒప్పందం కుదిరిందని, హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర బీడీ మ్యానుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌, బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు నెలసరి ఉద్యోగులకు బీడీ ప్యాకింగ్‌ వర్కర్స్‌కు వేతనాల పెంపుదల గురించి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు తెలిపారు. చర్చలలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు గోవర్ధన్‌, రాష్ట్ర నేతలు అనుమల్ల గంగాధర్‌, అయ్యవార్ల లక్ష్మణ్‌, ఆది రంగారెడ్డి, తదితరుల తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలు సఫలం కావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బీసీ వసతి గృహం సమీపంలో ధాన్యం లోడ్‌తో వెళ్తున్న డీసీఎం శుక్రవారం సాయంత్రం బోల్తా పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. డీసీఎంలో ఓవర్‌ లోడ్‌ చేసుకొని సురాయిపల్లి నుంచి లింగంపేటకు వస్తుండగా మండల కేంద్రంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement