నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి):ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ధర్మారెడ్డి గ్రామంలో శుక్రవారం వైద్యసిబ్బంది స్నేహ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌హెచ్‌పీ లావణ్య గ్రామంలోని కిశోర బాలికలకు, మహిళలకు రక్తహీనత గురించి వివరించడంతోపాటు దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలియజేశారు. తలసేమియా వ్యాధి గురించి..బాల్యవివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఆమె తెలియజేశారు. అనంతరం కిషోర బాలికలకు, మహిళలకు రక్త, బీపీ, షుగర్ పరీక్షలకు చేశా రు. ఏఎన్‌ఎం సంధ్యారాణి, ఆశావర్కర్లు అంజమ్మ, సావిత్రి, నాయకులు నారాయణ పాల్గొన్నారు.
వర్ని: మోస్రా గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల శిశువు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి మల్లారం గ్రామానికి చెందిన జర్పుల దశరథ్ భార్య నిరోషా, మూడు నెలల శిశువుతో నిజామాబాద్ నుంచి స్వగ్రామమైన మల్లారానికి కారులో వస్తోంది. మోస్రా శివారులో అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో కారు ప్రమాదానికి గురై పొలాల్లో బోల్తా కొట్టింది. ప్రమాదంలో మూడు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందగా, నిరోషకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చిరుత దాడిలో దూడ..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని లింగంపల్లి(ఖుర్దు) గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్ద కట్టేసిన పాడి దూడపై చిరుతపులి దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన చౌడ లింగం అనే రైతు తన పొలం వద్ద పాడి గేదెలు, ఆవులను గురువారం రాత్రి కట్టేసి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వెళ్లేసరికి చిరుత దాడిలో పాడి దూడ మృతి చెందినట్లు తెలిపారు. ఎర్రాపహాడ్ సెక్షన్ అధికారి వినోద్, బీట్ అధికారి లింగయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుత దాడిలోనే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. లింగంపేట పశువైద్యాధికారి హన్నా జోనస్ పోస్టుమార్టం నిర్వహించారు. దూడ విలువ రూ. 50 వేలు ఉంటుందన్నారు.


