అవగాహనతో జాగ్రత్త పడొచ్చు
● నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం
● 35 శిబిరాల ద్వారా 6 వేల
యూనిట్ల రక్తం సేకరణ
కామారెడ్డి అర్బన్: తలసేమియా వ్యాధి... చిన్నారుల్లో అరుదుగా వచ్చే ఈ వ్యాధికి ప్రతి 20 రోజులకు ఒక సారి రక్తం అందించడమే వైద్యం. రక్తం అందించకుంటే వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడే 250 మంది చిన్నారులకు అండగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్), ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలు అండగా నిలిచి గత మూడేళ్లలో మెగా రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటికి 6 వేల యూనిట్ల రక్తం సేకరించడం సాధారణ విషయం కాదు. రక్తదాతల సహకారంలో తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం తాము 6 వేల యూనిట్ల రక్తం సేకరించడం ఎంతో తృప్తిని ఇస్తుందని కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు అన్నారు. తమ సేవలు గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదు చేసి అవార్డు ప్రదానం చేశారని, దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు సేవా పురస్కారాలు అందించినట్టు బాలు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం దేశంలో 500 మంది చిన్నారులు తలసేమియా వ్యాధి బారిన పడుతున్నారు. తల్లిదండ్రుల హిమోగ్లోబిన్ స్థాయి, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్, జన్యు పరీక్షలను పెళ్లికి ముందే చేయడం ద్వారా తలసేమియా వ్యాధి పిల్లలు జన్మించకుండా చూసే అవకాశం ఉంటుంది. తలసేమియా వ్యాధితో జన్మించిన పిల్లలకు 20 రోజులకు ఒక సారి రక్తమార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా పూర్తి చికిత్సకు రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు వ్యయం అవుతుంది. పేదరికంలో ఉండే తల్లిదండ్రులకు ఇది పెద్ద భారం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి చిన్నారుల ప్రాణాలు కాపాడాలి.
– బాలు, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్


