కరెంట్ షాక్‌తో ఒకరి మృతి
వర్ని: మండలంలోని చలకతండాలో గురువారం విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. కేతావత్ కిశోర్ (29) సౌండ్ బాక్స్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడన్నారు. మృతుడి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డివైడర్‌ను ఢీకొన్న బైక్
● ముగ్గురికి గాయాలు
మద్నూర్(జుక్కల్): బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన మండల కేంద్రానికి సమీపంలోని 161 జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికుల, అంబులెన్స్ టెక్నిషియన్ సంజయ్ కథనం ప్రకారం.. డోంగ్లీకి చెందిన తుకారాం, అతడి అక్క పూజ, ఇద్దరు పిల్లలు ఆరాధ్య, సువాన్షు గురువారం మధ్యాహ్నం మద్నూర్ నుంచి మేనూర్ వైపు బైక్‌పై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో తుకారాం, పూజలకు స్వల్పగాయాలు కాగా ఆరాధ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆరాధ్యను దేగ్లూర్ ఆస్పత్రికి తరలించారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. గురువారం ఆరుగురిని ఆర్మూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.


