లింగంపేట/గాంధారి(ఎల్లారెడ్డి)/మద్నూర్(జుక్కల్): అన్నదాతను మరోసారి అకాల వర్షం ఆగం చేసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని గురువారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు తీశారు. లింగంపేట మండలం ముంబోజిపేట, ముంబోజిపేట తండా, కంచుమల్, భవానీపేట, జల్దిపల్లి, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల తదితర గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల వరద నీటిలో కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా గ్రామాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. తడిసిన దాన్యం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలంటున్నారు.
మద్నూర్ మండల కేంద్రంలో ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. అలాగే మార్కెట్‌కమిటీ యార్డులో రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న సంచులు తడిసిపోయాయి. గాంధారి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ధాన్యం కుప్పలు, మొక్కజొన్న, జొన్న తడిసిపోయాయి. డీఆర్డీవో సురేందర్ మేడిపల్లి గ్రామాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం వద్ద రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఏపీఎం ప్రసన్నకుమార్ తదితరులున్నారు.
జిల్లాలోని పలు చోట్ల కురిసిన
అకాల వర్షం
తడిసిన మొక్కజొన్న,
కొట్టుకుపోయిన ధాన్యం
కాపాడుకునేందుకు
తిప్పలుపడ్డ రైతులు


