మరోసారి మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

మరోసారి మొండిచేయి

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

మరోసారి మొండిచేయి

కాసుల తరువాత మరొకరికి దక్కని నామినేటెడ్‌ పదవి

నిరాశ, నిస్పృహల్లో కాంగ్రెస్‌ నేతలు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నామినేటెడ్‌ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లాకు కాంగ్రెస్‌ నేతలకు మళ్లీ నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల ముచ్చట వచ్చినప్పుడల్లా తప్పకుండా తమను పదవులు వరిస్తాయన్న నమ్మకంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. అయితే జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చివరికి నారాజ్‌ అవుతుండడం మామూలు విషయంగా మారింది. ఈ క్రమంలో బుధవారం విడుదలైన నామినేటెడ్‌ జాబితాలో ఒక్కరి పేరు కూడా లేకపోవడంతో జిల్లాకు చెందిన నాయకులు నిరాశకు గురయ్యారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పలువురు నేతలకు మొదటి విడతలోనే కీలకమైన పదవులు దక్కాయి. తాజాగా మరో ఇద్దరికీ అవకాశం దక్కింది. కామారెడ్డి జిల్లాలో ఒక్క కాసుల బాల్‌రాజును మాత్రమే నామినేటెడ్‌ వరించింది. ఆయనతోపాటు ఎంతో మంది నామినెటెడ్‌ పదవులపై ఆశలుపెట్టుకుని పనిచేస్తూ వచ్చారు. ఆయనను మినహాయించి మరెవరికీ అవకాశాలు దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తనకు మొదటి విడతలోనే నామినేటెడ్‌ పదవి దక్కుతుందని జిల్లా కేంద్రానికి చెందిన డీసీసీ మాజీ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కై లాస్‌ శ్రీనివాస్‌ ఆశించారు. ఏరోజైనా తనకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఉన్న ఆయనకు ఈ సారి కూడా అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు టి దేవరాజ్‌గౌడ్‌ సైతం నామినేటెడ్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి వెంట ఉండి పార్టీ ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీతోపాటు జిల్లాకు చెందిన ముఖ్యనేతలందరితోనూ సన్నిహిత సంబంధాలున్న దేవరాజ్‌గౌడ్‌ తనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవి దక్కుతుందని ఎదురుచూడగా నిరాశే ఎదురైంది. పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మొన్నటి వరకు పనిచేసిన పండ్ల రాజు ఫిషర్‌మెన్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవిని ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజక వర్గాలకు చెందిన మరికొందరు నాయకులు కూడా ఏదో ఒక నామినేటెడ్‌ పదవి దక్కుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన ఏ ఒక్కరినీ పదవులు వరించడం లేదు.

నామినేటెడ్‌ పదవుల పందేరంలో జిల్లాకు మొదటి నుంచీ అన్యాయమే జరుగుతోందని కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తరువాత అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. బాన్సువాడకు చెందిన సీనియర్‌ నాయకుడు కాసుల బాల్‌రాజుకు మాత్రమే నామినేటెడ్‌ దక్కింది. నాలుగు నియోజక వర్గాల నుంచి ఎంతో మంది ఆశలు పెట్టుకుని అన్ని ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరుకు చెందిన బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి నామినేటెడ్‌ పదవి కోసం ప్రయత్నించగా, ఆఖరుకు పీసీసీ పదవితో సరిపెట్టుకున్నారు. అదే మండలానికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. కామారెడ్డి నియోజకవర్గంలో మండల, జిల్లా స్థాయి నేతలు పలువురు ఏదైనా అవకాశం దక్కుతుందేమోనని ఇప్పటికీ ఆశతో ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీకి సన్నిహితుడైన గీరెడ్డి మహేందర్‌రెడ్డి నామినేటెడ్‌ పదవిపై పెట్టుకున్న ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. ఇలా ఎంతో మంది నేతలు అవకాశాలు దక్కకపోవడంతో నిరాశచెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement