రికవరీ శాతం ఆధారంగా..
చెరుకు రైతుకు కాస్త తీపి వార్త అందింది. మద్దతు ధర టన్నుకు వంద రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రైతులు మాత్రం వరి పంటకు ఇచ్చినట్లుగా బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● టన్నుకు రూ. వంద పెరుగుదల
● రూ.3,885 కు చేరిన ధర
● వరి లాగే బోనస్ ఇవ్వాలంటున్న రైతులు
జిల్లాలో ఒకప్పుడు 30 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగయ్యేది. సాగు ఖర్చులు, చెరుకు నరకడానికి కూలీలకు చెల్లించాల్సిన కూలీ రేట్లు పెరగడంతో పెట్టుబడులుపోనూ మిగిలేది అంతంత మాత్రంగానే ఉంటుండడంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లారు. ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తుండడంతో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. దీంతో చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది.
ఆంక్షలతో సాగుకు దూరం
జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, పాల్వంచ, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి తదితర మండలాల్లో దశాబ్దాలుగా చెరుకు సాగుపై రైతులకు అవగాహన ఉంది. అప్పట్లో అన్ని ప్రాంతాల్లో ఖండసారి చక్కెర కర్మాగారాలుండేవి. అలాగే పుట్ల కొద్ది బెల్లం వండేవారు. అయితే సారా తయారీలో నల్లబెల్లం వినియోగిస్తున్నారన్న సాకుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్లం వండడంపై ఆంక్షలు విధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. బెల్లం వండితే కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో చాలా మంది చెరుకుసాగుకు దూరమయ్యారు. సాగు కష్టాలు పెరగడం, కూలీల సమస్య, ధర సరిపోకపోవడంతో మరికొంతమంది చెరుకు సాగు నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆరేడు వేల ఎకరాలలో కూడా పంట సాగవడం లేదు.
చెరుకు పంటకు మద్దతు ధర మాత్రమే పెంచడంతో కొంతే ఊరట లభించిందని రైతులు పేర్కొంటున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధర పెరగడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల పంట అయిన వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం.. ఏడాది పంట అయిన చెరుకుకు సైతం ప్రోత్సాహకం అందించాలని రైతులు కోరుతున్నారు.
గతేడాది చెరుకు టన్ను ధర రూ. 3,774.90 ఉండేది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో టన్నుకు రూ.వంద పెరుగుతుంది. 10.25 శాతం ప్రాథమిక రికవరీ రేటుకు ఈ ధర వర్తిసుంది. రికవరీ రేటు ఎక్కువగా ఉంటే మద్దతు ధర మరింత పెరుగుతుంది. జిల్లాలో గాయత్రి షుగర్స్‌లో రికవరీ శాతం 10.95 ఉండడంతో టన్నుకు రూ. 110 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన చెరుకు టన్ను ధర రూ. 3,885 కు చేరుకోవచ్చని భావిస్తున్నారు.


