ఏసీబీకి చిక్కిన బోధన్‌ టౌన్‌ ఎస్సై | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన బోధన్‌ టౌన్‌ ఎస్సై

May 7 2026 8:08 AM | Updated on May 7 2026 8:08 AM

ఏసీబీకి చిక్కిన బోధన్‌ టౌన్‌ ఎస్సై ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

బోధన్‌టౌన్‌(బోధన్‌): బోధన్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై భాస్కరా చారి పాత కేసు విచారణలో రూ. 7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మార్చిలో ఓ సివిల్‌ వివాదంలో కేసునమోదు అయ్యింది. ఈ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసి అరెస్ట్‌ చేశారు. అయితే ఇదే కేసులో మరికొంత మంది ఉన్నారని, వారిని కూడా కేసులో ఇన్‌వాల్వ్‌ చేస్తామని ఎస్సై అందులోని ఓ వ్యక్తికి ఫోన్‌ చేసి చెప్పారు. ఈ సందర్భంగా రూ. 10 వేల లంచం డిమాండ్‌ చేశారు. ఈ కేసులో పట్టణానికి చెందిన ఓ రాజకీయ నాయకుడి అన్న కొడుకు ఉన్నారు. లంచం ఇవ్వడానికి నిరాకరించి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. పథకం ప్రకారం బుధవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు దారుడు ఎస్సైకి రూ. 7 వేలు ఇస్తుండగా ఏసీబీ అఽధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుకు సబంధించిన ఫిర్యాదు దారుడి వివరాలను గొప్యంగా ఉంచుతున్నామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ప్రజలు తమకు న్యాయం చేయాలని పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తే లంచం డిమాండ్‌ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖకు చెందిన 1064 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రుద్రూర్‌: పొతంగల్‌ మండలం కారేగాం గ్రామ పరిధిలో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం క్వారీలో లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అండుగంటి ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ నరహరి సునీల్‌ మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాల వల్ల మంజీర పరీవాహక ప్రాంతాల్లో ఉన్న లిఫ్ట్‌, డీ ఫ్లోరైడ్‌ పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తాగునీటి సరాఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని, సాగునీటి కోసం బోర్లు, లిప్ట్‌లపై ఆధార పడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. భారీ స్థాయిలో ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

వర్ని: మండలంలోని మల్లారం శివారులో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన అంజి.. పాత వర్నికి చెందిన గంగాధర్‌ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు బుధవారం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయన్నారు. గాయాలపాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement