● ఎనిమిది మందికి గాయాలు
● ఆందోళనకరంగా ఒకరి పరిస్థితి
కామారెడ్డి అర్బన్: రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందంలోని ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజంపేట మండలం ఆర్గొండకు చెందిన చౌదరి సిద్ధిరాములు కొడుకు భరత్ పెళ్లి కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లక్ష్మిదేవి గార్డెన్‌లో బుధవారం ఉదయం జరిగింది. అయితే కారులో బంధువులను తీసుకువస్తుండగా చిన్నమల్లారెడ్డి వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు తండ్రి సిద్ధిరాములు, తల్లి వినోద, మేనేత్త సుజాతతోపాటు మరో ఐదుగురు బంధువులు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో పెళ్లి కొడుకు మేనేత్త సుజాత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.


