ఇందల్వాయి : మండలంలోని గంగారాం తండా గ్రామానికి చెందిన నసీం సుల్తానా ఇంట్లో గత నెల 22వ తేదీన చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దించామన్నారు. బుధవారం గన్నారం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బొమ్మెర్ల సోమేశ్, శైలేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారన్నారు. నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూలీ పనులు చేసుకునే ఇద్దరు దొంగిలించిన బంగారు నగలను కన్నాపురం నరేందర్ అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలిపారన్నారు. వారి నుంచి బంగారు, వెండి నగలతోపాటు రూ.8,500 నగదు, రెండు సెల్‌ఫోన్‌లు, ఒక టీవీ, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వినోద్, ఎస్సై సందీప్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.


