దోమకొండ: మండల కేంద్రంలోని గండ్ల చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ ఐరేని నర్సయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 6 గంటల లోపు పనులకు చేరుకుని తిరిగి 10 గంటల వరకు పనులు ముగించుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలందరికి ఎండ వేడిమి నుంచి కాపాడుకునేందుకు టోపీలను అందజేస్తానన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు కొనసాగుతున్నాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం నిర్వహించిన నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, ఐదో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 1,607 మంది విద్యార్థులకుగాను 1,522 మంది హాజరు కాగా 85 మంది గైర్హాజరైనట్లు వివరించారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన రెండో సెమిస్టర్ రెగ్యులర్, మూడో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 298 మంది విద్యార్థులకుగాను 283 మంది హాజరు కాగా 15 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.


