‘కోఆప్షన్‌’కు ముహూర్తం ఖరారు | - | Sakshi
Sakshi News home page

‘కోఆప్షన్‌’కు ముహూర్తం ఖరారు

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

నాలుగు పదవులు.. రసవత్తరంగా రాజకీయం..

రేపు ఉదయం 11 గంటలకు

కౌన్సిల్‌ హాల్‌లో ఎన్నిక

బరిలో 33 మంది.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. బల్దియాలోని కౌన్సిల్‌ హాల్‌లో చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, అదనపు కలెక్టర్‌ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికకు కౌన్సిల్‌ సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు హాజరుకావాలని చైర్‌పర్సన్‌ మంగళవారం ఒక ప్రకటన ద్వారా కోరారు.

మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్‌ పదవులు ఉండగా.. మొత్తం 35 దరఖాస్తులు వచ్చాయి. ఇద్దరు త మ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తు తం 33 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి 25 మంది, బీజేపీ నుంచి ఐదుగురు, బీ ఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నా రు. 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జనరల్‌ విభాగంలో ఇద్దరు (ఒక పురుషుడు, ఒక మహిళ), మైనారిటీ విభాగంలో ఇద్దరు (ఒక పురుషుడు, ఒక మహిళ) సభ్యులను ఎన్నుకోనున్నారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో చైర్‌పర్సన్‌ ఎన్నిక సమయంలో కాంగ్రెస్‌తో జతకట్టిన బీఆర్‌ఎస్‌.. ఈసారి కూడా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు రెండు కోఆప్షన్‌ పదవులు కావాలని బీఆర్‌ఎస్‌ పట్టుబడుతుండగా, ఒక పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్‌లోనూ రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ మద్దతుతో చెరో రెండు పదువులను పంచుకుని కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టుందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యూహాలకు పదును..

కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం ఆయా పార్టీలు సమావేశం అవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు తమ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అటు బీఆర్‌ఎస్‌, బీజేపీ కౌన్సిలర్లు కూడా విడివిడిగా భేటీ కానున్నారు. కుంబాల రవి(బీఆర్‌ఎస్‌), గోనె సునీత(కాంగ్రెస్‌), తయ్యబ్‌ సుల్తానా(కాంగ్రెస్‌), జమీరొద్దీన్‌(కాంగ్రెస్‌)కు అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పిడుగు మమత, ముస్కాన్‌, భాస్కర్‌గౌడ్‌లతో పాటు మరికొందరు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement