నిజామాబాద్ అర్బన్: అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు సుధీర్‌రెడ్డితో కలిసి చైర్మన్ రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన అదనపు కలెక్టర్లు తమ జిల్లాల్లో స్థానిక సంస్థల పనితీరును వివరించారు. ప్రజాప్రతినిధులు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి సారించాలని రాజయ్య సూచించారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


