‘డబ్లింగ్‌’ దిశగా.. | - | Sakshi
Sakshi News home page

‘డబ్లింగ్‌’ దిశగా..

May 5 2026 7:08 AM | Updated on May 5 2026 7:08 AM

‘డబ్లింగ్‌’ దిశగా.. పనులు పూర్తయితే..

వందేభారత్‌ పట్టాలెక్కేది అప్పుడే!

అవసరమైన చోట భూసేకరణ ప్రక్రియ

జిల్లాలో త్వరలో పనులు

ప్రారంభించనున్న రైల్వే శాఖ

సికింద్రాబాద్‌ –నాందేడ్‌ మధ్య రోజూ 56 రైళ్లు తిరుగుతున్నాయి. అలాగే పదికిపైగా గూడ్స్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే సింగిల్‌ లైన్‌ మూలంగా క్రాసింగ్‌లతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గాన్ని డబ్లింగ్‌ చేస్తే రైళ్ల రాకపోకలకు ఆటంకాలు తొలగిపోవడంతో పాటు మరిన్ని రైళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి తోడు వందేభారత్‌ ట్రైన్‌ కూడా కేటాయించడంతో రవాణాకు మరింత మేలు జరగనుంది.

సింగిల్‌ లైన్‌తో ఇబ్బందులు...

సికింద్రాబాద్‌ నుంచి నాందేడ్‌ రూట్‌లో కామారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల పరిధిలో ప్రస్తుతం సింగిల్‌ లైన్‌ ఉంది. దీంతో రైళ్ల రాకపోకలకు కొంత ఇబ్బందికరంగా ఉంది. చాలా సందర్భాల్లో క్రాసింగ్‌లతో సమయం వృథా అవుతోంది. ఒకే సమయంలో ఎదురెదురుగా రైళ్లు వచ్చినప్పుడు ఒక దానిని సమీపంలోని స్టేషన్‌లో నిలిపివేయాల్సి వస్తోంది. ఎదురుగా వచ్చే రైలు వెళ్లిపోయిన తర్వాత లైన్‌ క్లియర్‌ చేస్తున్నారు. గేటు పడినప్పుడల్లా పది నిమిషాల వరకు వేచి చూడాల్సి వస్తుండడంతో ప్రయాణికులు విసిగిపోతున్నారు.

ముథ్కేడ్‌ –మేడ్చల్‌ రూట్‌లో 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్‌ పనులను 2023లో ప్రారంభించారు. ఇప్పటికే చాలావరకు పనులు జరిగాయి. ఈ రూట్‌లో డబ్లింగ్‌ పనులు 2029 లోగా పూర్తి చేయాలన్న లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. కాగా కామారెడ్డి జిల్లాలో పొందుర్తి, సరంపల్లి, కామారెడ్డి, తిప్పాపూర్‌, రామేశ్వర్‌పల్లి, భిక్కనూరు, బస్వాపూర్‌, ఉప్పల్‌వాయి గ్రామాల పరిధిలో దాదాపు పది ఎకరాల భూమి అవసరం పడింది. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసే పనిలో అధికారులున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికే నిజామాబాద్‌ వైపు నుంచి డబ్లింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. ఉప్పల్‌వాయి నుంచి కామారెడ్డి మీదుగా పనులు చేపట్టాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే జిల్లాలోనూ డబ్లింగ్‌ జరగనుంది. మరోవైపు అమృత్‌ స్కీంలో కామారెడ్డి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇటు స్టేషన్‌ ఆధునికీకరణ పనులు, అటు డబ్లింగ్‌ పనులు జరిగితే ప్రయాణికులకు మేలు జరుగనుంది.

హైదరాబాద్‌, నాందేడ్‌ మధ్య ప్రయాణానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతోంది. డబ్లింగ్‌ పూర్తయితే రైళ్ల వేగం కూడా పెరిగే అవకాశాలున్నాయి. కాగా ఈ మార్గంలో ఇప్పటికే వందేభారత్‌ రైలు మంజూరయ్యింది. డబ్లింగ్‌ పనులు పూర్తయ్యాక ఈ రైలును ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ రైలొస్తే హైదరాబాద్‌ – నాందేడ్‌ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. రైల్వే డబ్లింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

రైల్వే డబ్లింగ్‌ పనుల దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికే నిజామాబాద్‌ జిల్లాలో పనులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో కొన్నిచోట్ల భూమి సేకరించాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తికాగానే డబ్లింగ్‌ పనులు మొదలుపెట్టనున్నారు.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement