కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. పదోన్నతి పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. కామారెడ్డి పట్టణ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎల్లారెడ్డికి ఏఎస్సైగా, జిల్లాలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి. వారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిశారు. ఎస్పీ వారందరికీ పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన వారిలో సదాశివనగర్ పీఎస్‌కు చెందిన మురళి మోహన్, దోమకొండకు చెందిన రజినీకాంత్, దేవునిపల్లి నుంచి శ్రీనివాస్, నస్రుల్లాబాద్ నుంచి హరిచంద్ర, బీర్కూర్ నుంచి కిషన్, బిచ్కుంద నుంచి జీవన్, సీసీఎస్ నుంచి గణపతి, మైసయ్యలు ఉన్నారు. ఉత్తమ సేవలందించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
కామారెడ్డి క్రైం: కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్ నియమితులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. కామారెడ్డి అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన చైతన్యరెడ్డి ఇటీవలే రంగారెడ్డి అదనపు ఎస్పీగా బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మధుసూధన్ కామారెడ్డి డివిజనల్ పోలీస్ అధికారిగా బదిలీపై వచ్చారు.
కామారెడ్డి అర్బన్: విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్‌ఈ సాలియా నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇనుప కూలర్లు వినియోగించవద్దని, ఇనుప వైర్లపై దుస్తులు అరవేయవద్దని, ప్రతి ఇంటికి ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగల కింద రాజకీయ పార్టీలు జెండాలు ఏర్పాటు చేయవద్దని, పొలాలకు కరంట్ వైర్లతో కంచెలు ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
కామారెడ్డి క్రైం: ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉద్యాన శాఖపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. భిక్కనూరులోని ఎస్‌వీ గార్డెన్స్, తాడ్వాయిలోని మా గార్డెన్స్, నస్రుల్లాబాద్ రైతు వేదిక, జుక్కల్‌లోని సాయగౌడ్ రైతు తోటలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంపు, ఆధునిక సాగు పద్ధతులు, కూరగాయలు, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై సమగ్ర సమాచారం అందిస్తామని తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలకు హాజరుకావాలని కోరారు.


