● వర్షాలు కురిసినా వడ్లు
తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : రాబోయే ఐదు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి, ఇతర మంత్రులు, అధికారులు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమై డివిజన్‌ల వారీగా వరి కొనుగోళ్లపై సమీక్షించారు. వడ్లు తడవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, పిట్లం, నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి లారీల్లో వెంటనే తరలించాలన్నారు. టార్పాలిన్లు, డ్రెయినేజీ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎల్లారెడ్డి డివిజన్‌లో ధాన్యం నిల్వలు తడవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


