సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాకేంద్రంలో అధ్వానంగా ఉన్న వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన ఎస్‌ఆర్ ఫౌండేషన్.. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ కోరిన అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకుని, సమాచారం ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బల్దియా ఎలా స్పందిస్తుందోనన్న అంశంపై అంతటా చర్చ నడుస్తోంది.
కామారెడ్డిలో ఉన్న రెండు హిందూ శ్మశాన వాటికలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. గతంలో అభివృద్ధి పనులు చేపట్టిన అసంపూర్తిగా వదిలేశారు. దీంతో అంత్యక్రియల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. హౌసింగ్ బోర్డు సమీపంలోని శ్మశాన వాటికలో సమస్య తీవ్రంగా ఉంది. దీనిపై ‘అంతిమ’ కష్టాలు శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనం ప్రజలను కదిలించింది. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ చర్చ నడిచింది. అంతిమ కష్టాలు తీర్చేందుకు ఎస్‌ఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. గతనెల 27న ఎస్‌ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అదనపు కలెక్టర్ మధుమోహన్‌ను కలిసి తమ సంస్థ ఆధ్వర్యంలో శ్మశాన వాటికను తీర్చిదిద్దుతామని లేఖ అందించారు. దీనిని పరిశీలించిన జిల్లా అధికారులు ఎస్‌ఆర్ ఫౌండేషన్ కోరిన అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. కమిషనర్ నిర్ణయం కోసం ఫౌండేషన్ ప్రతినిధులు వేచి ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు వస్తే ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రణాళిక తయారుచేస్తామని పేర్కొంటున్నారు.
జిల్లా కేంద్రంలో అధ్వానంగా
వైకుంఠధామం
అభివృద్ధి చేయడానికి అనుమతించాలని కోరిన ఎస్‌ఆర్ ఫౌండేషన్
వినతిని పరిశీలించాలని బల్దియా
కమిషనర్‌కు అదనపు కలెక్టర్ ఆదేశాలు


