ఫుట్‌బాల్ శిక్షణ ఇస్తున్నా..
సద్వినియోగం చేసుకోండి
● జిల్లాలో 20 వేసవి శిక్షణ శిబిరాలు
● 20 క్రీడల్లో శిక్షణ
రామారెడ్డి: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా మే నుంచి వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ సిద్ధమైంది. ఇందు కోసం ఆయా మండలాల్లో క్రీడల్లో నైపుణ్యం కల్గిన వారిని శిక్షకులుగా నియమించింది. జిల్లావ్యాప్తంగా 10 క్యాంప్‌లు రూరల్ ప్రాంతాలలో 10 క్యాంప్‌లు అర్బన్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి జూన్ 7 వరకు ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 20 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా, ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూరల్ ప్రాంతాలలో రూ.5 వేల, అర్బన్ ప్రాంతాలలో రూ.7,500 చొప్పున శిక్షకులకు ఇవ్వనుంది.
అర్బన్‌లో నిర్వహించే క్రీడలకు మాత్రమే ఫీజు
అర్బన్ ప్రాంతాల్లో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజు చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ప్రాంతంలో క్రీడలకు ఎలాంటి ఫీజు లేకుండానే పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్బన్ క్రీడల్లో అథ్లెటిక్స్ క్రీడాకారుడు రూ.400 చొప్పున, బాస్కెట్ బాల్‌కు రూ.400, బ్యాడ్మింటన్‌కు రూ.1,000, క్రికెట్, టేబుల్ టెన్నిస్‌కు రూ.700, స్కేటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్‌కు రూ.800 చొప్పున ఫీజు నిర్ణయించారు.
రామారెడ్డిలో క్రీడా శిక్షణ శిబిరంలో భాగంగా ఫుట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నాం. 50 నుంచి 70 మంది వరకు హాజరవుతున్నారు. క్రీడలో మెలకువలు నేర్చుకోవడం, క్రమశిక్షణ నేర్చుకోవడం, సమయం వృథా కాకుండా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం.
– రేకుల బాల్‌రాజ్,
ఫుట్‌బాల్ శిక్షకుడు, రామారెడ్డి
మే లో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా అర్బన్ 10, రూరల్లో 10 చొప్పున మొత్తం 20 క్యాంపులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు వేసవిలో ఖాళీగా ఉండకుండా క్రీడల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ఇది మంచి అవకాశం. సీఎం క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు.
–రంగ వెకంటేశ్వర్‌గౌడ్, జిల్లా యువజన క్రీడాధికారి


