బదిలీపై వెళ్తున్న సీఐకి సన్మానం | - | Sakshi
Sakshi News home page

బదిలీపై వెళ్తున్న సీఐకి సన్మానం

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

బదిలీపై వెళ్తున్న సీఐకి సన్మానం బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం విద్యుత్‌ తీగలు తగిలి హార్వెస్టర్‌ దగ్ధం బాబుపై దాడి ఘటనలో కేసు నమోదు

భిక్కనూరు: రెండున్నర ఏళ్లకు పైగా భిక్కనూరు సీఐగా పనిచేసి హైదరాబాద్‌లోని ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న సంపత్‌కుమార్‌ను సోమవారం పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. భిక్కనూరు సీఐగా ఆయన ప్రజలతో కలిసి మెలిసి ఉండి శాంతి భధ్రతల పరిరక్షణకు ఎంతగానో కృషి చేశాడని కొనియాడారు. శాలువా, మొమెంటోలతో సత్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి, కాంగ్రెస్‌ జిల్లా ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, నేతలు అంకం రాజు, శ్రీరాం వెంకటేష్‌లు పాల్గొన్నారు.

భిక్కనూరు: మహత్మా జ్యోతీబాపూలే బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియేట్‌ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కో–ఆర్డినేటర్‌ శ్రీలత సోమవారం తెలిపారు. 2026–27 సంవత్సరానికిగాను కామారెడ్డి జిల్లాలో బాలుర కోసం నాలుగు, బాలికల కోసం నాలుగు కళాశాలలు ఉన్నాయన్నారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పదవ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపు జరుగుతుందన్నారు. ఈనెల 12 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

గోశాలలో అగ్ని ప్రమాదం

3 వేల గడ్డి కట్టలు దగ్ధం

మాక్లూర్‌ : మండలంలోని వేణుకిసాన్‌ నగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గాలిబ్‌నగర్‌ వద్ద గల శ్రీమన్నారాయణ గోశాలలో సోమవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పశువుల మేత కోసం ఉంచిన సుమారు 3000 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గోశాలలో ఉన్న గడ్డి కట్టలన్నీ కాలిపోయాయి. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ గోశాల నిర్వాహకుడు మాట్లాడుతూ రైతులు తమకు తోచిన విధంగా గడ్డి కట్టలు దానం చేయాలని కోరారు.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్‌ గ్రామంలో వరి కోస్తున్న హార్వెస్టర్‌కు విద్యుత్‌ తీగలు తగలడంతో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. హార్వెస్టర్‌కు విద్యుత్‌ తీగలు తగలడంతో గమనించిన డ్రైవర్‌ చాకచక్యంతో వెంటనే మిషన్‌ పైనుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, విద్యుత్‌ తీగలు చేతికందేలా వేలాడుతున్నాయని గతంలో విద్యుత్‌ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వేలాడుతున్న తీగలను వెంటనే సరి చేయాలని కోరుతున్నారు.

సిరికొండ: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఒక బాబుపై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. సోమవారం ఇద్దరు హిజ్రాలు ఆటోలో వచ్చి తన బాబును గోడకేసి కొట్టినట్లు తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement