● మూడు గేదెలు మృతి,
ఆరుగురికి గాయాలు
● ఉప్పల్‌వాయిలో ఘటన
రామారెడ్డి: కారు అదుపుతప్పి పశువుల పాకలోకి దూసుకెళ్లిన ఘటన మండల పరిధిలోని ఉప్పల్‌వాయి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలంలోని సోమారంపేట నుంచి కారులో గంగవత్ సుభాష్‌తోపాటు మరో ఐదుగురు వ్యక్తులు గాంధారి వైపు వెళ్తున్నారు. ఉప్పల్‌వాయి గ్రామంలోకి రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పశువుల పాకలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకటి తీవ్రంగా గాయపడింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. బాధితుడు జింగిటి రాజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


