సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండల కేంద్రానికి చెందిన కార్లం సతీశ్(38) గత కొంత కాలంగా కుటుంబ సమస్యలతోపాటు అనారోగ్యంతో మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. సతీశ్ ఇద్దరు పిల్లలు చిన్న వయస్సులోనే మరణించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఉరేసుకోగా, చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సతీశ్ మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కడుపునొప్పితో మరొకరు..
మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన నిమ్మలబోయిన భూమయ్య(66) కొన్ని సంవత్సరాలుగా కడుపునొప్పి, అల్సర్‌తో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూయించుకున్నా ఆరోగ్యం కుదుటపడలేదు. ఆదివారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీర్ఘకాలిక అనారోగ్యం, తీవ్ర నొప్పుల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. మృతుడి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


