డిచ్‌పల్లి: మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురైన గుర్తుతెలియని వృద్ధుడు(70) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు డిచ్‌పల్లి ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. ఏడో బెటాలియన్ సమీపంలోని విక్టరీ హైస్కూల్ దగ్గర వృద్ధుడు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు డిచ్‌పల్లి ఎస్సై 8712659852, సీఐ 8712659851 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామ శివారులో ఉన్న పెద్దవాగు నుంచి శనివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసు క తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. శనివారం రాత్రి పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పెద్దవాగులో ఆకస్మికంగా తనిఖీలు చేయగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఇసుక లేదా మొరం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్– 4 ఆధ్వర్యంలో ఆదివారం నీట్ విద్యార్థుల కోసం క్యాంపస్ ఆవరణలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సయ్య మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, వనరులు అందితే వారు కూడా ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారని తెలిపారు. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు అవసరమైన సహకారం అందించారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు అనిల్, సమీర్, రాజేందర్, కృష్ణ, ఆకాష్ పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ బంగారు దుకాణంలో దుండగుల కాల్పుల కలకలం నేపథ్యంలో ఆదివారం రూర ల్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అలాగే హోటళ్లను సైతం విస్తృతంగా తనిఖీ చేశారు. వాహనదారుల వివరాలతోపాటు, హోటళ్లలో ఉంటున్న వారి వివరాలు సేకరించారు. ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్, ఎస్సై షరీఫ్‌తోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి నుంచి దేవాయిపల్లి మీదుగా బ్రాహ్మణపల్లి వరకు ఉన్న రోడ్డు అధ్వాననంగా తయారైంది. ప్రతి రోజూ ఈరోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో నిర్మించిన కల్వర్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరువ తీసుకొని ఈ రోడ్డును బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.


