వృద్ధురాలి హత్య కేసులో నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్య కేసులో నిందితుల అరెస్టు

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

భిక్కనూరు: వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు భిక్కనూరు సీఐ సంపత్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. మెదక్‌ జిల్లా బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన తొత్తల సుశీల (83)ఏప్రిల్‌ 29న కాచాపూర్‌ నుంచి కామారెడ్డికి వెళ్తానని చెప్పి అదృశ్యమైన విషయమై భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, సుశీల రాజంపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యుడిని కలిసి చికిత్స చేయించుకునేందుకు వెళ్లింది. ఆస్పత్రి వద్ద సుశీలకు షేర్‌ శంకర్‌ తండాకు చెందిన బోక్య బోలి అనే మహిళతో పరిచయమైంది. ఇద్దరూ కలిసి కల్లు దుకాణంలోకి వెళ్లి కల్లు సేవించారు. అదే సమయంలో రాజంపేటకు చెందిన బస్వయ్య అక్కడికి వచ్చి వీరితో మాట్లాడారు. అనంతరం ముగ్గురు కలిసి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్లి అక్కడ సైతం మద్యం సేవించారు. ఆ తర్వాత సుశీల చేతులకు ఉన్న రెండు వెండి కడియాలు, మూడు వెండి గాజులు లాక్కొని ఆమెను బావిలోకి తోశారు. రాజంపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రి, వైన్‌షాపుల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా సుశీలతో బోక్యబోలి, బసవయ్య ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే బావిలో పడేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు బావి వద్దకు వెళ్లి సుశీల మృతదేహాన్ని బయటికి తీశారు. నిందితుల నుంచి మూడు వెండి గాజులు, రెండు వెండి కడియాలు, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సంపత్‌కుమార్‌ తెలిపారు. ఆయన వెంట ఎస్సైలు ఆంజనేయులు, రాజు ఉన్నారు.

కామారెడ్డి క్రైం: ఆర్థిక సమస్యలు వెన్నాడటంతో మనస్తాపానికి గురైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీ పాత ఎస్పీఆర్‌ పాఠశాల సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు .. శ్రీనివాస్‌(43) అనే వ్యక్తి గాంధారి మండలం పేట్‌ సంగెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం తన భార్య, ఇద్దరు పిల్లలను పోచంపాడ్‌లోని అత్తగారింటికి పంపించి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. శనివారం సాయంత్రం శ్రీనివాస్‌ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు తెరిచి చూడగా, శ్రీనివాస్‌ ఇంట్లో ఉరేసుకొని విగతజీవిగా కనిపించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో రెండు, మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడు ..

గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్ర శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని గుర్జాల్‌ గ్రామానికి చెందిన మంగళారం శ్రీకాంత్‌(24) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై ఎస్సై మహేందర్‌ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

శ్రీనివాస్‌(ఫైల్‌ )

Advertisement
 
Advertisement
Advertisement