మద్నూర్(జుక్కల్): రెండు రోజుల నుంచి కొనసాగుతున్న రథోత్సవం శనివారం రాత్రి ముగిసింది. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో రథపౌర్ణమి సందర్భంగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. యువకులు, గ్రామస్తులు రథాన్ని లాగుతు లక్ష్మీరమణ గోవింద... వెంకట రమణ గోవింద అంటూ భక్తి పారవశ్యంలో మునిగారు. రథోత్సవంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని మాజీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
ఉత్కంఠ భరితంగా సాగిన కుస్తీ పోటీలు
రథోత్సవం సంబర్భంగా గోశాలలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్కంఠగా సాగాయి. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గోన్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఆడపిల్లలు సైతం కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. గెలిచిన వారికి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే నగదు బహుమతిని అందించారు.


