● జిల్లాలో రంగురంగుల
పంటలు పండిస్తున్న రైతులు
● నేడు హోలీ పండుగ
ఆర్మూర్: హోలీ పండుగ అంటే కేవలం రంగులు చల్లుకోవడమే కాదు. మానవ జీవితంలో రంగులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మనుషుల భావోద్వేగాలపై, పర్యావరణంపై లోతైన ప్రభావం చూపుతాయి. జిల్లా రైతాంగం వివిధ రంగులలో ఉన్న పంటలను పండిస్తూ ఆకాశంలోని సప్తవర్ణాల హరివిల్లును నేలపై ఉండేలా మారుస్తున్నారు.
● జిల్లాలో ఇందల్వాయి, సిరికొండ, వర్ని, మాక్లూర్ మండలాల్లో సుమారు 86 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంతో పాటు పల్లె గట్లపై వేసవి కాలంలో మోదుగ పూల చెట్టు విరగబూస్తుంది. ఈ పువ్వులతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పువ్వులను నీళ్లలో ఉడకబెట్టి తయారు చేసిన రంగును హోలీ రోజున ప్రత్యేకంగా ఉపయోగిస్తుంటారు.
● అదేవిధంగా విత్తన వ్యాపారానికి కేరాఫ్‌గా మారిన ఆర్మూర్ ప్రాంతంలో పండించే ఎర్ర
జొన్నలు కోతకు వచ్చిన తర్వాత కల్లాల్లో ఆరబెట్టిన ఎర్రజొన్నలతో గ్రామాలు ఎరుపు మయంగా మారుతాయి.
● జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జూన్ నెలలో ప సుప పంట విత్తుకుంటారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుంది.దీంతో జనవరి, ఫిబ్రవ రి నెలల్లో పసుపు కల్లాలు అమ్మవారిని మరిపించేలా పసుపుమయంగా మారుతాయి.
● జిల్లాలో వరి తరువాత మొక్కజొన్న పంటను విస్తారంగా పండిస్తారు. రోహిణీ కార్తె, వర్షాకాలం, వేసవి కాలాల్లో మూడు పంటలను తీస్తారు. ఈ మొక్కజొన్న పంట కోతలు పూర్తయిన తరువాత రైతుల ఇంటి ముందర పోసిన మక్కల రాసులతో నారింజ (ఆరెంజ్) రంగు శోభితమవుతుంది.
● వరి పంట నారు పో సిన నాటి నుంచి కో తలు పూర్తయ్యే వర కు వేల హెక్టార్లలోని పొలాలు భూమాతకు పచ్చ ని చీర కట్టుకున్నట్లుగా కనువిందు చేస్తుంది.
● ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోని నీరు నీలం రంగును పులుముకొని కనువిందు చేస్తాయి.
● జిల్లాలోని బోధన్, భీమ్‌గల్ తదితర ప్రాంతాల్లో నల్ల రేగడి నేలలు ఉండటంతో పత్తి పంటను పండిస్తున్నారు. మరో వైపు విత్తన వ్యాపారం అభివృద్ధి చెందిన ఆర్మూర్ ప్రాంతంలో తెల్లజొన్నలను సైతం పండించి ఉత్తర భారత దేశంతో పాటు దేశ విదేశాలకు పశువుల దాణా కోసం ఎగుమతి చేస్తున్నారు.
రేపు హున్సాలో పిడిగుద్దులాట
బోధన్‌రూరల్(బోధన్): తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలోగల హున్సా గ్రామం ‘పిడిగుద్దులాట’తో ప్రత్యేకతను చాటుకుంటుంది. దేశంలో ఎక్కడలేని విధంగా దశాబ్ధాల కాలం నుంచి హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట నిర్వహించడం సాలూర మండలంలోని హున్సా గ్రామ ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏటా కామదహనం చేసిన మరుసటి రోజు గ్రామంలో పిడిగుద్దులాట నిర్వహిస్తారు. సోమవారం గ్రామంలో కామదహనం నిర్వహించారు. నేడు (మంగళవారం) సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా రేపు (బుధవారం) పిడిగుద్దులాటను నిర్వహించేందుకు గ్రామపెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండలానే ఆకాంక్షతో కుల, మత, వయోబేధం లేకుండా ఐక్యతతో పిడిగుద్దులాటను ఆడుతూ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పిడిగుద్దులాట నిర్వహణపై పోలిస్ శాఖ నుంచి అభ్యంతరం వస్తున్నా గ్రామస్తులంతా ఐకమత్యంతో అధికారులను ఒప్పంచి ఆటను ఆడుతున్నారు. గతంలో ఒక ఏడాది పిడిగుద్దులాటను నిలిపివేయగా తమ గ్రామానికి అనేక విధాలుగా నష్టం వాటిల్లిందని అప్పటినుంచి తప్పనిసరిగా ఈ పిడిగుద్దులాటను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు అంటున్నారు.


