ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను రాష్ట్ర అబ్జర్వర్లు రమేష్, అబ్దుల్ నబీలు సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాలలోని కేంద్రాలను వారు పరిశీలించారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లు విశాల, రాజశేఖర్‌లకు సూచించారు.
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మూసి వేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తామని, బుధవారం వేకువజామున ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహించి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామన్నారు.
రామారెడ్డి: ప్రముఖ పుణ్యాక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి) శ్రీకాలభైరవుడి ఆలయం నేటి ఉదయం 7 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రభుగుప్తా తెలిపారు. మంగళవారం సంపూర్ణ చంద్ర గ్రహణం ఉన్నందున దేవాలయం బుధవారం ఉదయం ఆలయం సంప్రోక్షణ చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ పరీక్షల్లో ఒకరు డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలు, యూనివర్సిటీ మెయి న్ క్యాంపస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, భిక్కనూర్ సౌత్‌క్యాంపస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పీజీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ, రెగ్యులర్ మొదటి, 7వ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,905 మంది విద్యార్థులకు గానూ 1,798 మంది హాజరు అయ్యారు. 107 మంది గైర్హాజరయ్యారు. ఆర్మూర్‌లోని పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడటంతో డిబార్‌కు గురయ్యారు.
మాచారెడ్డి: కోళ్లకు సాధరణంగా రెండు కాళ్లు మాత్రమే ఉంటాయి. అయితే మాచారెడ్డి మండలం గజ్యనాయక్ తండా చౌరస్తాలోని ఎజాజ్ అనే యువకుడి చికెన్ సెంటర్‌లో నాలుగు కాళ్ల కోడి ఽసోమవారం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చికెన్ సెంటర్ వద్దకు భారీగా తరలివచ్చి వింత కోడిని చూశారు. జన్యులోపంతో అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతుందని పలువురు విదావంతులు తెలిపారు.


