ప్రకృతి చికిత్సాలయం సందర్శన
రుద్రూర్: మండలంలోని అక్బర్‌నగర్‌లో ఉన్న ప్రకృతి చికిత్సాలయాన్ని కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు గురువారం సందర్శించారు. ఆరోగ్య సంరక్షణ, సహజ చికిత్స విధానాలపై అవగాహన పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా చికిత్సాలయంలో అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యోగా గురువు డాక్టర్ సాయిలు హెల్త్ యోగా ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నస్రుల్లాబాద్ ఎంఈవో డీ చందర్, బీర్కూర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్ ప్రాంతాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


