ధాన్య లక్ష్ములు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మహిళల జీవనోపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహిళా శక్తి పథకం ద్వారా కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్ల ఏర్పాటు, హైర్‌బస్సుల కొనుగోలు, పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు, సోలార్ పవర్ ప్లాంట్‌లు.. ఇలా అనేక రకాల వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగేలా వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే స్థానికంగా రైతులు పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా మహిళలకు ఆయా సీజన్‌లలో మంచి ఆదాయం సమకూరుతుందన్న ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నారు. అప్పట్లో కొద్ది గ్రామాల్లో మాత్రమే కేంద్రాలు ఇవ్వగా.. గత సీజన్ నుంచి కేంద్రాల సంఖ్యను పెంచారు. ముఖ్యంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించింది. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్‌లో 194 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి 15 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అంటే జిల్లాలో ఉత్పత్తి అయిన దాంట్లో దాదాపు 40 శాతం ధాన్యాన్ని మహిళా సంఘాలు కొనుగోలు చేశాయి. దీని ద్వారా మహిళా సంఘాలకు రూ.5 కోట్ల మేర కమీషన్ రానుంది.కొనుగోలు కేంద్రాల్లో మహిళలు రాత్రింబవళ్లు కష్టపడి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం నుంచి మిల్లులో దింపేదాకా మహిళలు బాధ్యతగా పనిచేశారు. కాగా ధాన్యం కొనుగోలులో డోంగ్లీ మండలం కుర్ల గ్రామ సమాఖ్య అగ్రస్థానంలో నిలిచింది. గ్రామ సంఘం ఆధ్వర్యంలో 489 మంది రైతుల నుంచి 55,434 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.13.24 కోట్లు. దీని ద్వారా మహిళా సంఘానికి రూ.17.7 లక్షల కమిషన్ రానుంది. ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా కుర్ల మహిళలు జిల్లాలోనే అగ్రస్థానంలో ఉన్నారు. కామారెడ్డి మండలంలోని శాబ్దిపూర్ గ్రామ సమాఖ్యను మోడల్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ఖరీఫ్ సీజన్‌లో 177 మంది రైతుల దగ్గరి నుంచి 6,321 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.1.53 కోట్లు. కొనుగోలు చేయడం ద్వారా మహిళలకు రూ.2 లక్షల ఆధాయం సమకూరుతోంది. ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు విషయంలో మహిళా సంఘాలను ప్రోత్సహించి ప్రతి సీజన్‌లో మంచి ఆదాయం సమకూరాలన్న లక్ష్యంగా అధికారులు పావులు కదుపుతున్నారు. మహిళా సంఘాల బాధ్యులు బాధ్యతగా పనిచేస్తూ కేంద్రాల నిర్వహణలో సక్సెస్ అయ్యారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిద్దాం!
మహిళా సంఘాల
ఆధ్వర్యంలో 194 కేంద్రాలు
ఖరీఫ్‌లో 15 లక్షల క్వింటాళ్ల
ధాన్యం సేకరణ
కమీషన్‌గా రూ.5 కోట్ల ఆదాయం
ధాన్య లక్ష్ములు!


