మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం
బాన్సువాడ: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పాత అంగడిబజార్‌లో నిర్మాణంలో ఉన్న సమీకృత దుకాణ సముదాయంలో డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలకు శనివారం నిర్వహించిన స్వయం ఉపాధిపై అవగాహన సదస్సుకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి పోచారం హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు పెద్ద పీట వేస్తోందని, కుటీర పరిశ్రమల ద్వారా మహిళలు నెలవారీ ఆదాయం సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకుంటారని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పరిశ్రమను సంప్రదించి ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలను తీసుకువచ్చామని, యంత్రాలు పని చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మహిళలు తమకు నచ్చిన రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొవచ్చని, ఆహార పదార్థాలు(ఫుడ్ ప్రాసెసింగ్), అలంకరణ వస్తువులు(కాస్మోటిక్), వస్త్రాలు, చేతివృత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేశామని.. అవి విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మెప్మా పీడి శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ కౌన్సిలర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.


