వీడిన ఉత్కంఠ
● పుర పోరుకు ఖరారైన రిజర్వేషన్లు
● రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లక్కీ డ్రా..
● మహిళా కోటా కేటాయింపు ● కొందరికి మోదం.. మరి కొందరికి ఖేదం
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక ఘట్టం ముగిసింది. ఎన్నాళ్ల నుంచో ఆశావహులు ఎదురుచూసిన రిజర్వేషన్‌లపై స్పష్టత వ చ్చింది. కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమక్షంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలి టీలకు సంబంధించిన రిజర్వేషన్‌లను అధికారు లు ఖరారు చేశారు. మహిళా సీట్లను డ్రా ద్వారా కేటాయించడంతో ఉత్కంఠకు తెరపడింది.
జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారె డ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వార్డుల రిజర్వేషన్‌ల జాబితాను శుక్రవారమే సిద్ధం చేశారు. మహిళా కోటా సీట్లను మాత్రం ఈసారి డ్రా పద్ధతిలో కేటాయించారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్సీ, బీసీ, జనరల్ మహిళ స్థానాలను లక్కీ డ్రా పద్ధతిన ఎంపిక చేశారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 92 వార్డులకుగాను 45 వార్డులు మహిళలకు రిజర్వ్ చేశారు. ఈ వార్డులకు డ్రా తీయగా మిగిలినవి జనరల్ రిజర్వ్‌డ్‌గా కేటాయించారు. మహిళా రిజర్వేషన్ల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా, ఉత్కంఠగా సాగింది.
తాము పోటీ చేయాలనుకుంటున్న వార్డు మహిళకు వెళ్తుందా.. జనరల్‌లో ఉంటుందా.. అని ఆశావహులు శ్వాస బిగబట్టి ఎదురుచూశారు. చాలామంది సిట్టింగ్‌లకు రిజర్వేషన్లు షాక్ ఇవ్వగా, మరికొందరికి మాత్రం అదృష్టం వరించింది. పాత వార్డులు మారిపోవడం, రిజర్వేషన్లు తారుమారు కావడంతో కొందరు సీనియర్లు పక్క వార్డుల వైపు చూపు సారిస్తుండగా, కొత్త ముఖాలు మాత్రం ఉత్సాహంగా కనిపిస్తున్నాయి.


