రైతునగర్‌లో సంబురంగా..
● జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో
సంక్రాంతి వేడుకలు
● పలు పోటీల నిర్వహణ
● కొనసాగనున్న కార్యక్రమాలు
బాన్సువాడ : బీర్కూర్ మండలంలోని రైతునగర్‌లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. బతుకుదెరువు, ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం పట్టణాలకు, విదేశాలకు వెళ్లిన వారు పండుగ సందర్భంగా సొంతూరుకు వచ్చారు. గ్రామంలో 15 ఏళ్లుగా జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. దేశవిదేశాల్లో ఎక్కడ స్థిరపడ్డా పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చి సంబురాల్లో పాలపంచుకుంటున్నారు. బుధవారం తెల్లవారు జామున భోగి పండుగను జరుపుకున్నారు. గ్రామస్తులందరూ ఒక్కచోట చేరి ఆటలాడడం, భోజనాలు చేయడంలాంటివి చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు మ్యూజికల్ చైర్, రన్నింగ్, చెంచాగోళీ, కబడ్డీ, వాలీబాల్, కోలాటం, తాడుగుంజడం లాంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో గెలుపొందిన వారికి కనుమ రోజున బహుమతులు అందిస్తారు.


