ఇక హ్యామ్ రోడ్లు!
రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ రహదారుల రూపురేఖలు మార్చడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రహదారులను అభివృద్ధి చేయనుంది. ఈ విధానంలో జిల్లాలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి 130 కిలోమీటర్లు విస్తరించేందుకు 8 రోడ్లు మంజూరయ్యాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● ప్రభుత్వ, ప్రైవేటు
భాగస్వామ్యంతో విస్తరణ
● జిల్లాలో 130 కి.మీ.
ఆర్‌అండ్‌బీ రోడ్లకు అనుమతి
కామారెడ్డి–తూంపల్లి రోడ్డు
రాష్ట్రంలో రోడ్ల నాణ్యతను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొనసాగనుంది. ఈ విధానంలో ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చనుండగా.. మిగిలిన 60 శాతం నిధులను నిర్మాణ సంస్థ పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన పెట్టుబడిని ప్రభుత్వం 15 సంవత్సరాల్లో ఏడాదికోసారి చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. ఇదే సమయంలో పదిహేనేళ్ల పాటు రోడ్డు నిర్వహణ బాధ్యత కూడా నిర్మాణ సంస్థదే ఉంటుంది. హ్యామ్ విధానంలో జిల్లాలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి 130 కిలోమీటర్లు విస్తరించేందుకు 8 రోడ్లు మంజూరయ్యాయి.
మూడు కేటగిరీలలో..
మూడు కేటగిరీలుగా రోడ్ల విస్తరణ పనులు సాగనున్నాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి, ఒక మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి రోడ్లను విస్తరిస్తారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు కూడా రోడ్లను వేయనున్నారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పెద్ద సంఖ్యలో రోడ్లను హ్యామ్‌లో చేర్చారు. కొన్ని జిల్లాల్లో వందలాది కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించారు. కామారెడ్డి జిల్లాలోనే అతి తక్కువ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. జిల్లాలో చాలాచోట్ల సరైన రోడ్డు రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో చాలా రోడ్లు విస్తరణకు నోచుకోవడం లేదు. కొన్నిచోట్ల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. అలాగే రోడ్లు ఉన్నా వాగులపై వంతెనలు లేక ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు తారు రోడ్లు లేవు. జిల్లాలోని ఆయా రోడ్ల అభివృద్ధికి నిధులు తీసుకు వచ్చే విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తగిన ప్రతిపాదనలతో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది. రోడ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేలు నిధులు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.


