కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి
క్రైం కార్నర్
కామారెడ్డి క్రైం: ఇద్దరు బాలురు సరదాగా స్నానం చేసేందుకు వెళ్లి కుంటలో మునిగి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండా కు చెందిన తెజావత్ సాయి కుమార్ (16), భుక్యా సురేష్ (15) చదువు మానేసి కొద్ది రోజులుగా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని ఓ కల్లు దుకాణంలో పని చేస్తున్నారు. వారిద్దరూ మంగళవారం సాయంత్రం వరకు కల్లు దుకాణంలో పనులు చేసి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం వారిద్దరి మృతదేహాలు సమీపంలో ఉండే రాఘవాపూర్ గ్రామ శివారు లోని ఓ కుంటలో తేలాయి. సమాచారం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున కుంట వద్దకు చేరుకున్నారు. దేవునిపల్లి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఎస్సై రాజు విచారణ జరిపి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి బట్టలు గట్టుపై ఉండటంతో వారిద్దరూ స్నానం చేయడానికి కుంటలోకి దిగి ఉంటారని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో చోటుచేసుకున్న ఘటన
కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి
కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి


