50 పడకల ఆస్పత్రిగా దోమకొండ సీహెచ్‌సీ
● జీవో జారీ చేసిన ప్రభుత్వం
కామారెడ్డి టౌన్: ఎట్టకేలకు దోమకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్‌గ్రేడ్ అయ్యింది. ఈ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూ మంగళవారం జీవో జారీ చేశారు. మొదట వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే ప్రభుత్వం మాత్రం 50 పడకల ఆస్పత్రినే మంజూరు చేసింది. నూతన ఆస్పత్రి భవనం సివిల్ వర్కులు, పరికరాల కోసం ఆర్థిక శాఖ ఆమోదంతో రూ. 22 కోట్లను మంజూరు చేశారు.
‘ఫిర్యాదుదారులు
పూర్తి వివరాలు ఇవ్వాలి’
కామారెడ్డి క్రైం: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు తమ పూర్తి వివరాలు ఇవ్వాలని ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. దరఖాస్తులో తమ పూర్తి చిరునామా, సెల్‌ఫోన్ నంబర్ తప్పనిసరిగా రాసి ఇవ్వాలని పేర్కొన్నారు. తద్వారా ఇచ్చిన ఫిర్యాదు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నది, ఏ అధికారి విచారణ చేస్తున్నారు అనే విషయాలను మొబైల్ నంబర్ ద్వారా పిటిషన్‌దారులకు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఫిర్యాదుల విషయంలో పారదర్శకత కోసం ఇది ఉపయోగపడుతుందని వివరించారు.
బయోమైనింగ్
యంత్రం ఏర్పాటు
కామారెడ్డి టౌన్: క్యాసంపల్లిలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో బుధవారం బయోమైనింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ఈ యంత్రాన్ని మున్సిపల్ నిధులతో కొనుగోలు చేసి ఏర్పాటు చేశారు. పట్టణంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాక ఈ బయోమైనింగ్ యంత్రం ద్వారా తడి– పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తారు. పర్యావరణ కాలుష్యాన్ని కాపాడేందుకు ఈ బయోమైనింగ్ యంత్రం ఎంతగానో దోహదపడుతుందని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
కోలుకుంటున్న
కల్తీ కల్లు బాధితులు
గాంధారి: గౌరారం కలాన్‌లో మంగళవారం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైనవారు కోలుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం కల్తీ కల్లు తాగినవారిలో 17 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసింది. వారిని అదేరోజు రాత్రి బాన్సువాడ, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. వారందరూ కోలుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. కల్తీ కల్లుకు బాధ్యులైన గ్రామానికి చెందిన శంకర్ గౌడ్, పాపాగౌడ్‌లపై కేసులు నమోదు చేశామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
50 పడకల ఆస్పత్రిగా దోమకొండ సీహెచ్‌సీ


